23, జూన్ 2026, మంగళవారం

క్వార్టర్ల తొలగింపుపై ఏఐటియుసి ఆగ్రహం.. కార్మికుల జోలికి వస్తే ఉద్యమం తప్పదన్న మడ్డి ఎల్లా గౌడ్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

క్వార్టర్ల తొలగింపుపై ఏఐటియుసి ఆగ్రహం.. కార్మికుల జోలికి వస్తే ఉద్యమం తప్పదన్న మడ్డి ఎల్లా గౌడ్

గోదావరిఖని, జూన్ 23 (ఇది మన హక్కు): అభివృద్ధి పేరుతో సింగరేణి కార్మికుల క్వార్టర్లు, వాటికి ఆనుకొని ఉన్న షెడ్లను తొలగించే ప్రయత్నాలను సహించబోమని ఏఐటియుసి ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్ హెచ్చరించారు.

గోదావరిఖనిలోని భాస్కర్‌రావు భవన్‌లో జరిగిన ఏఐటియుసి ఆర్జీ-1 బ్రాంచి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, వంకబెండు నుంచి చౌరస్తా వరకు ఉన్న క్వార్టర్ల వద్ద కార్మికులు సొంత ఖర్చుతో నిర్మించుకున్న షెడ్ల తొలగింపుపై యాజమాన్యం జారీ చేసిన నోటీసులను తీవ్రంగా ఖండించారు. స్ట్రక్చర్ మీటింగ్‌లో చర్చించకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకోవడం సరికాదన్నారు.

గతంలో అభివృద్ధి కోసం క్వార్టర్ల తొలగింపునకు సహకరించామని, ఇకపై కార్మికుల హక్కులకు భంగం కలిగించే చర్యలను అంగీకరించబోమని స్పష్టం చేశారు. తొలగింపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో బాధిత కార్మిక కుటుంబాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.

సమావేశంలో ఏఐటియుసి బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీనివాస్, నాయకులు సదానందం, ఎస్. వెంకట్ రెడ్డి, బాధిత కార్మికులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి