తెలంగాణ ఉద్యమకారులకు హామీల అమలుపై న్యాయం చేయాలి: తెలంగాణ ఉద్యమకారుల వేదిక
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
తెలంగాణ ఉద్యమకారులకు హామీల అమలుపై న్యాయం చేయాలి: తెలంగాణ ఉద్యమకారుల వేదిక
తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేసి, అసలైన ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన న్యాయం చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర వైస్ చైర్మన్ తోడేటి శంకర్ గౌడ్ డిమాండ్ చేశారు.
అంతర్గాం మండలంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రామగుండం నియోజకవర్గ ఇన్‌చార్జి నూతి తిరుపతి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉద్యమకారుల సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులకు గుర్తింపు కార్డులు, ఉచిత బస్సు మరియు రైల్వే పాస్‌లు, 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ.25 వేల పెన్షన్, రూ.20 లక్షల ఆరోగ్య బీమా కార్డు, ఉద్యమకారుల కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు.
ఈ సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర కన్వీనర్ అనుముల కళావతి, కో-కన్వీనర్ తోడేటి స్వరూప, రాష్ట్ర కార్యదర్శి చిలక శంకర్, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కోడిపుంజుల జ్యోతి, జిల్లా ప్రధాన కార్యదర్శి ఒల్లాల మల్లేశం, ఎన్టీపీసీ పట్టణ అధ్యక్షుడు వీరాల తదితరులు పాల్గొన్నారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారుల వేదిక అంతర్గాం మండల కమిటీని ఎన్నుకున్నారు. మండల అధ్యక్షుడిగా పైడిపల్లి రమేష్ గౌడ్, ఉపాధ్యక్షుడిగా సమ్మెట తిరుపతి, ప్రధాన కార్యదర్శిగా తిగుట్ల నవీన్, కోశాధికారిగా బొంతు ఆనంద్, సహాయ కార్యదర్శిగా కొట్టే తిరుపతిని ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. కొత్త కమిటీ తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు.
కామెంట్‌లు