25, జూన్ 2026, గురువారం

సింగరేణి కార్మికుల 31 డిమాండ్లపై సుదీర్ఘ చర్చలు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

సింగరేణి కార్మికుల 31 డిమాండ్లపై సుదీర్ఘ చర్చలు

హైదరాబాద్, జూన్ 25 (ఇది మన హక్కు): సింగరేణి కార్మికుల 31 డిమాండ్ల పరిష్కారం కోసం గుర్తింపు సంఘం ఎఐటీయూసీ ఇచ్చిన సమ్మె నోటీసుపై గురువారం హైదరాబాద్‌లో అసిస్టెంట్ లేబర్ కమిషనర్ డా. శాశ్వతి రథ్ సమక్షంలో సుదీర్ఘ చర్చలు జరిగాయి. కార్మికుల సమస్యలు, పెండింగ్ డిమాండ్లు, ఉద్యోగ భద్రత, సంక్షేమ అంశాలపై ఇరుపక్షాలు తమ వాదనలు వినిపించాయి.

చర్చల అనంతరం డా. శాశ్వతి రథ్ జూలై 10లోపు ప్రధాన సమస్యల పరిష్కారానికి యాజమాన్యం, గుర్తింపు సంఘం పరస్పర చర్చల ద్వారా సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. అప్పటికీ పరిష్కారం కాకపోతే మళ్లీ చర్చలు నిర్వహిస్తామని తెలిపారు.

కార్మికుల న్యాయమైన డిమాండ్లపై యాజమాన్యం స్పష్టమైన హామీ ఇవ్వకపోతే సమ్మె అనివార్యమని ఎఐటీయూసీ నాయకులు హెచ్చరించారు. కార్మికుల హక్కులు, సంక్షేమం, ఉద్యోగ భద్రత విషయంలో రాజీ ఉండదని స్పష్టం చేశారు.

చర్చల్లో ఎఐటీయూసీ అధ్యక్షుడు వాసిరెడ్డి సీతారామయ్య, ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి మిరియాల రంగయ్య, ఉప ప్రధాన కార్యదర్శి కే. సారయ్య పాల్గొనగా, యాజమాన్యం తరఫున ఏజీఎం పర్సనల్ అజయ్ కుమార్ హాజరయ్యారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి