అంతర్‌కుల దంపతులపై సామాజిక బహిష్కరణ అమానుషం : డా. మార్షల్ దుర్గం నగేష్.
ఇది మన హక్కు రామగుండం మండల్ రిపోర్టర్✍️
అంతర్‌కుల దంపతులపై సామాజిక బహిష్కరణ అమానుషం : డా. మార్షల్ దుర్గం నగేష్..
పశ్చిమగోదావరి జిల్లా వీరవాసరం మండలం ఉత్తర పాలెం గ్రామంలో అంతర్‌కుల వివాహం చేసుకున్న దంపతులపై జరుగుతున్న సామాజిక బహిష్కరణను సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. మార్షల్ దుర్గం నగేష్ తీవ్రంగా ఖండించారు. రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కుతూ కులం పేరుతో యువ దంపతులను వేధించడం దారుణమని మండిపడ్డారు.
శెట్టిబలిజ సామాజిక వర్గానికి చెందిన యువకుడు, ఎస్సీ మాల సామాజిక వర్గానికి చెందిన యువతిని ప్రేమించి వివాహం చేసుకోవడాన్ని అడ్డుకోవడం సమాజానికి మచ్చ అని అన్నారు. కుటుంబాన్ని గ్రామంలోకి రానివ్వబోమని హెచ్చరించడం, సామాజిక బహిష్కరణ విధించడం పూర్తిగా చట్టవిరుద్ధమని పేర్కొన్నారు.
పెళ్లి సందర్భంగా ఆలయ తలుపులు మూసివేయడం, గ్రామ యువతను బెదిరించడం అత్యంత హేయమని విమర్శించారు. బాధితులు పోలీసులను ఆశ్రయించినా తక్షణ చర్యలు కనిపించకపోవడం విచారకరమన్నారు. దంపతుల కుటుంబాన్ని గ్రామంలో ఒంటరిచేసి చెరువు చేపల వాటా నిలిపివేయడం, ఇంటి పరిసరాల్లో మౌలిక సదుపాయాలను తొలగించే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వెంటనే అధికారులు స్పందించి బాధిత కుటుంబానికి రక్షణ కల్పించడంతో పాటు, వివక్షకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డా. మార్షల్ దుర్గం నగేష్ డిమాండ్ చేశారు.
కామెంట్‌లు