వివాహ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మద్దెల దినేష్ దంపతులు
ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️
వివాహ దినోత్సవం సందర్భంగా గోదావరిఖనిలో అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసిన మద్దెల దినేష్ దంపతులు
కులాంతర వివాహం చేసుకొని మూడు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ తన సతీమణి సౌజన్య తో కలిసి గోదావరిఖనిలోని మున్సిపల్ టి జంక్షన్ వద్ద డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి, పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కుల వ్యవస్థ నిర్మూలనకు కులాంతర వివాహాలు అత్యంత అవసరమని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ భావించారని, ఆ స్ఫూర్తితో అనేక మంది నూతన దంపతులు కులాంతర వివాహం చేసుకున్న తర్వాత తమ జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ఆదర్శ వివాహాలను ప్రోత్సహించడానికి మరియు కులరహిత సమాజ స్థాపనకు అడుగులు వేస్తున్న దంపతులకు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ గారు స్ఫూర్తిదాయకమని అన్నారు. కులాలు, మతాలకు అతీతంగా వివాహాలు చేసుకోవడం వల్ల సామాజిక ఐక్యత పెరుగుతుందని నాడే అంబేద్కర్ సూచించారని గుర్తు చేశారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వ భద్రత కరువుతోందని, పరువు హత్యల పేరుతో దేశంలో, రాష్ట్రంలో మారణహోమం జరుగుతోందని ఆయన ఆరోపించారు. కులాంతర వివాహాలు చేసుకున్న వారికి ప్రభుత్వాలు నూతన చట్టాలు తీసుకొచ్చి సరైన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదర్శ వివాహాలు చేసుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహకాల కింద ప్రవేశపెట్టిన *“డాక్టర్ అంబేద్కర్ స్కీమ్ ఫర్ సోషల్ ఇంటిగ్రేషన్ త్రూ ఇంటర్ క్యాస్ట్ మేరేజెస్”* పథకాన్ని పూర్తిగా మరచిపోయినట్లుందని దినేష్ పేర్కొన్నారు.
ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులాంతర వివాహం చేసుకుంటున్న వారికి భద్రతతో పాటు ప్రోత్సాహకాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటియుసి రామగుండం నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ. గౌస్, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు తొడుపునూరి రమేశ్ కుమార్ పాల్గొని సౌజన్యదినేష్ దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
కామెంట్‌లు