ఉచిత సూర్యరశ్మితో విద్యుత్ ఉత్పత్తి చేసుకోవాలి.. పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని మేయర్ మహంకాళి స్వామి సూచన
రామగుండం, అక్టోబర్ 03 (ఇది మన హక్కు): ప్రతి ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉత్పత్తి చేసి, అవసరాలకు వినియోగించుకోవడంతో పాటు మిగులు విద్యుత్‌ను ఎన్పీడీసీఎల్కు విక్రయించి ఆదాయం పొందాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి సూచించారు.
శనివారం శారదానగర్ ఈఆర్ఓ కార్యాలయంలో ఎన్పీడీసీఎల్ ఆధ్వర్యంలో పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన పథకంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి మేయర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ బొగ్గు, నీటి కొరత కారణంగా విద్యుత్ ఉత్పత్తి వ్యయం పెరుగుతోందని, డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ సరఫరా చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి అధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేస్తున్నప్పటికీ ప్రజలపై భారం పడకుండా ప్రభుత్వం తక్కువ ధరకు విద్యుత్ అందిస్తోందని తెలిపారు.
ప్రతి ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకుని ఉచితంగా లభించే సూర్యరశ్మిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా సొంతంగా విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చని అన్నారు. సోలార్ పలకల ఏర్పాటును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పీఎం సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన కింద రూ.78,000 వరకు సబ్సిడీ అందిస్తోందని తెలిపారు.
అదనంగా అవసరమైన మొత్తానికి బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తూ తక్కువ వడ్డీతో నెలవారీ వాయిదాల్లో చెల్లించే అవకాశం కల్పిస్తున్నాయని వివరించారు. పథకం ప్రయోజనాలపై ఎన్పీడీసీఎల్ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించాలని మేయర్ సూచించారు.
కార్యక్రమంలో కార్పొరేటర్ దాసరి సాంబమూర్తి, ఎన్పీడీసీఎల్ డీఈఈ ప్రభాకర్, ఏడీఈలు గుండు శ్రీనివాస్, ఇ. రమేష్, ఎన్పీడీసీఎల్ అధికారులు, సిబ్బంది, పలువురు విద్యుత్ వినియోగదారులు పాల్గొన్నారు..


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి