మార్కింగ్ పూర్తికాని ఇళ్లను గుర్తించాలి.. కొత్తగా మంజూరైన ఇళ్ల ప్రొసీడింగ్స్ పంపిణీ త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ కోయ శ్రీహర్ష
పెద్దపల్లి, అక్టోబర్ 09 (ఇది మన హక్కు): ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద మంజూరైన ఇళ్ల నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష హౌసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లో ఇందిరమ్మ ఇళ్ల పథకం అమలు, నిర్మాణ పనుల పురోగతిపై ఆయన సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కొత్తగా మంజూరైన ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రొసీడింగ్స్ పంపిణీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రొసీడింగ్స్ అందజేసి, ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మొదటి జాబితాలో మంజూరైన ఇళ్లలో ఆశించిన స్థాయిలో పురోగతి లేని వాటిపై ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. నిర్మాణ పనులు ప్రారంభించని లబ్ధిదారులను సంప్రదించి, పనులు మొదలుపెట్టకపోవడానికి గల కారణాలను తెలుసుకోవాలని, ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
మొదటి జాబితాలో ఇప్పటివరకు మార్కింగ్ పూర్తికాని ఇళ్లను క్షేత్రస్థాయిలో గుర్తించి, వెంటనే మార్కింగ్ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. మార్కింగ్ పూర్తయిన ఇళ్లలో నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా లబ్ధిదారులతో సమన్వయం చేసుకుని పనులు ప్రారంభించేలా చూడాలని తెలిపారు.
ప్రతి ఇంటి నిర్మాణం ఏ దశలో ఉందో వివరాలు సేకరించి, పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే సమస్యలను గుర్తించి సత్వరమే పరిష్కరించాలని, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు.
లబ్ధిదారులకు పథకం మార్గదర్శకాలను వివరించి, ఇళ్ల నిర్మాణాలు సకాలంలో పూర్తయ్యేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ సమీక్షలో హౌసింగ్ పీడీ పవన్ కుమార్, డిప్యూటీ ఈఈ దస్తగిరి, ఏఈలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి