పోషకాహారం, మహిళా సాధికారత, లింగ సమానత్వంపై అవగాహన.. జెండర్ స్పెషలిస్ట్ భూపల్లి సంస్కృతి
కమాన్‌పూర్, అక్టోబర్ 05 (ఇది మన హక్కు): మహిళల ఆరోగ్యం, పిల్లల పోషకాహారం, సమాజంలో లింగ సమానత్వంపై అవగాహన కల్పించే లక్ష్యంతో పెద్దపల్లి జిల్లాలో నిర్వహిస్తున్న ‘పోషణ్ మాహ్’ కార్యక్రమాల్లో భాగంగా కమాన్‌పూర్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా మహిళా సాధికారత కేంద్రం జెండర్ స్పెషలిస్ట్ భూపల్లి సంస్కృతి హాజరై గ్రామీణ మహిళలు, యువత, గర్భిణులకు పలు అంశాలపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా భూపల్లి సంస్కృతి మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల్లో ప్రభుత్వం అందిస్తున్న టోల్‌ఫ్రీ సేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఆపదలో ఉన్న మహిళలు, పిల్లలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
‘బేటీ బచావో–బేటీ పడావో’ కార్యక్రమం, లింగ వివక్ష నిర్మూలన, బాలికల సంరక్షణ, విద్య ప్రాధాన్యతను వివరించారు. మహిళా సాధికారత కేంద్రం ద్వారా అందుతున్న సేవలను తెలియజేశారు. మహిళలు వ్యక్తిగత పరిశుభ్రత, ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణలో హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతను గుర్తించాలని సూచించారు.
పేద, మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించే ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన, ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన పథకాలపై అవగాహన కల్పించారు. ఆడపిల్లల భవిష్యత్తు, ఉన్నత విద్య కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాలను తెరవాలని సూచించారు.
యువత స్వయం ఉపాధి వైపు అడుగులు వేయడానికి టాస్క్, గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థల ద్వారా అందుతున్న ఉచిత నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలను వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రభుత్వ పథకాలపై ప్రజలకు స్పష్టత వస్తుందని గ్రామ ప్రజాప్రతినిధులు తెలిపారు.
కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యలత, కమాన్‌పూర్ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, పెంచికల్పేట్ సర్పంచ్ పల్లె మాధవి నారాయణ, ఉప సర్పంచ్ సోహెల్, ఉపాధ్యాయులు, ఏఎన్ఎంలు, ఆశా వర్కర్లు, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణులు, బాలింతలు, గ్రామీణ మహిళలు పాల్గొన్నారు..

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి