ఢిల్లీలో పోలీసుల చర్యలను సవాల్ చేస్తూ NWMI పిటిషన్.. జర్నలిస్టుల రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి
న్యూఢిల్లీ అక్టోబర్ 14 (ఇది మన హక్కు): ఢిల్లీలో నిరసన కార్యక్రమాలను కవర్ చేస్తున్న జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించడం, బలవంతంగా అదుపులోకి తీసుకోవడం, అక్కడి నుంచి తరలించడం వంటి చర్యలు రాజ్యాంగ హక్కుల ఉల్లంఘనకు దారితీస్తున్నాయని ఆరోపిస్తూ నెట్వర్క్ ఆఫ్ విమెన్ ఇన్ మీడియా, ఇండియా (NWMI) సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేసింది.
జర్నలిస్టులపై పోలీసుల చర్యలు రాజ్యాంగంలోని ఆర్టికల్ 14, 19(1)(a), 19(1)(d), 21లను ఉల్లంఘిస్తున్నాయని పిటిషన్లో పేర్కొన్నట్లు సమాచారం. నిరసన కార్యక్రమాల సందర్భంగా స్వతంత్రంగా వార్తలు సేకరించే జర్నలిస్టులకు రక్షణ కల్పించాలని మీడియా సంఘం కోరింది.
సీనియర్ జర్నలిస్టు పరంజోయ్ గుహా ఠాకుర్తా అక్టోబర్ 10న తన ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) గుర్తింపు కార్డును చూపించినప్పటికీ పోలీసులు తనను అదుపులోకి తీసుకున్నారని పిటిషన్లో ప్రస్తావించారు. నిర్బంధానికి గల కారణాలు తెలియజేయలేదని, సంబంధిత పత్రాలు కూడా అందించలేదని ఆయన పేర్కొన్నట్లు వివరించారు.
ఢిల్లీలో రెండు రోజుల వ్యవధిలో కనీసం 35 మంది జర్నలిస్టులను నిర్బంధించినట్లు కమిటీ టు ప్రొటెక్ట్ జర్నలిస్ట్స్ (CPJ) నివేదికను కూడా పిటిషన్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.
నిరసన కార్యక్రమాల సమయంలో విధులు నిర్వహించే జర్నలిస్టుల హక్కులను పరిరక్షించేందుకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలని NWMI విజ్ఞప్తి చేసింది. ఈ పిటిషన్‌తో జర్నలిస్టుల భద్రత, స్వేచ్ఛగా వార్తా సేకరణ చేసే హక్కుల అంశం మరోసారి చర్చనీయాంశమైంది..

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి