వేట వలలు, ఉచ్చులు, ఇనుప బోను స్వాధీనం.. ప్రజలకు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు: మంథని ఎఫ్ఆర్ఓ ఎం.వి. నాయక్
కమాన్‌పూర్, అక్టోబర్ 07 (ఇది మన హక్కు): వన్యప్రాణుల సంరక్షణ ప్రతి ఒక్క పౌరుడి సమిష్టి బాధ్యత అని మంథని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ఎం.వి. నాయక్ తెలిపారు. పెద్దపల్లి జిల్లా అటవీ అధికారి ఆదేశాల మేరకు బుధవారం ముత్తారం మండలం ఆడవి శ్రీరాంపూర్ గ్రామంలో అటవీ, పోలీస్ సిబ్బంది సంయుక్తంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.
మంథని, పెద్దపల్లి ఫారెస్ట్ రేంజ్‌ల సిబ్బంది స్థానిక ముత్తారం పోలీసుల సహకారంతో చేపట్టిన తనిఖీల్లో 2 వేట వలలు, 20 ఉచ్చులు, ఒక ఇనుప బోను, 2 కిలోల బైండింగ్ వైర్ స్వాధీనం చేసుకున్నారు.
వన్యప్రాణుల వారోత్సవాల్లో భాగంగా అనంతరం గ్రామస్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ ఎం.వి. నాయక్ మాట్లాడుతూ చెట్లను అక్రమంగా నరికివేయడం, వన్యప్రాణులను వేటాడటం చట్టప్రకారం శిక్షార్హమైన నేరాలని తెలిపారు. అటవీ వనరులు, వన్యప్రాణుల సంరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలని కోరారు. అక్రమ వేటకు పాల్పడినట్లు గుర్తిస్తే కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
అనంతరం తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాల దర్యాపూర్‌లో విద్యార్థులు, సిబ్బందికి వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించారు. ఆదివిశ్రాంపూర్ బీట్ పరిధిలోని కంపార్ట్మెంట్ నంబర్ 444 రిజర్వ్ ఫారెస్ట్‌లో ట్రెక్కింగ్ నిర్వహించారు. మంథని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, వ్యాసరచన పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మంథని ఎఫ్ఆర్ఓ ఎం. వినయ్ నాయక్, పెద్దపల్లి ఎఫ్ఆర్ఓ టి. సతీష్ కుమార్, డిప్యూటీ రేంజ్ అధికారులు పి. దేవదాస్, ఎన్. రమేష్, ఫారెస్ట్ సెక్షన్ అధికారులు ఎం. నరసయ్య, హెచ్. మంగీలాల్, ఎస్.డి. రహిమతుల్లా, ఎం.డి. అమీర్‌ఉద్దీన్, ముదస్సర్ షా ఖాన్, నహీదా పర్వీన్, ఎం. రవి, ఫారెస్ట్ బీట్ అధికారులు కె. పవన్ కుమార్, ఎం. శ్రీకాంత్, ఎస్. మేఘ రాజు, కె. తిరుపతి, పి. రంజిత, ఎస్. శ్రావంతి, ఎ. మాధురి, ఎస్. ప్రదీప్, ఫీల్డ్ బయాలజిస్ట్ ఎం. చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి