అక్టోబర్ 11 నుంచి 17 వరకు థియరీ పరీక్షలు.. ప్రశ్నపత్రాల భద్రత, పరీక్షా కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పక్కాగా ఉండాలి: అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు
పెద్దపల్లి, అక్టోబర్ 08 (ఇది మన హక్కు): తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో అక్టోబర్-2026లో నిర్వహించనున్న 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో పరీక్షల నిర్వహణకు చేపట్టాల్సిన ముందస్తు ఏర్పాట్లపై జిల్లా అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. పరీక్షా కేంద్రాల్లో భద్రత, ప్రశ్నపత్రాల భద్రత, విద్యుత్ సరఫరా, వైద్య సేవలు, పారిశుద్ధ్యం, తాగునీరు, పరీక్షా సిబ్బంది, జవాబు పత్రాల తరలింపు తదితర అంశాలను సమీక్షించారు.
అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పరీక్షలను నిర్ణీత షెడ్యూల్ ప్రకారం ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన ఏర్పాట్లను ముందుగానే పూర్తి చేయాలని ఆదేశించారు.
పెద్దపల్లి పట్టణంలోని రెండు పరీక్షా కేంద్రాల వద్ద పటిష్టమైన భద్రత కల్పించాలని, పోలీస్ సిబ్బంది, హోంగార్డులను బందోబస్తు విధుల్లో ఏర్పాటు చేయాలని సూచించారు. పరీక్షల సమయంలో పరీక్షా కేంద్రాల వద్ద 144 సీఆర్‌పీసీ అమలు చేయడంతో పాటు పర్యవేక్షణకు సిట్టింగ్ స్క్వాడ్ అధికారులను నియమించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు పెద్దపల్లి పోలీస్ స్టేషన్‌లో స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేసి, నిర్ణీత విధానం ప్రకారం పరీక్షా కేంద్రాలకు తరలించాలని సూచించారు. పరీక్షలు పూర్తయిన అనంతరం జవాబు పత్రాలను సీల్ చేసిన బండిళ్లుగా ప్రతిరోజూ సురక్షితంగా పోస్టల్ శాఖకు అప్పగించాలని ఆదేశించారు.
పరీక్షా సమయాల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా టీజీ ఎన్‌పీడీసీఎల్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలని, పరీక్షా కేంద్రాల్లో ప్రథమ చికిత్సకు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల కోసం ఓఆర్‌ఎస్ ప్యాకెట్లను సిద్ధంగా ఉంచాలని తెలిపారు.
పరీక్షా కేంద్రాలు, పరిసరాల్లో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, విద్యార్థులకు సురక్షితమైన తాగునీరు అందుబాటులో ఉంచాలని సూచించారు. పరీక్షలకు ముందు గదుల్లో క్రిమిసంహారక ద్రావణం స్ప్రే చేయించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు.
పరీక్షా సిబ్బంది కొరత ఉంటే సంబంధిత జూనియర్ కళాశాలల ప్రిన్సిపాళ్లతో సమన్వయం చేసుకుని అవసరమైన సిబ్బందిని సమకూర్చాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులకు సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని జడ్పీహెచ్‌ఎస్ బాలికల, జడ్పీహెచ్‌ఎస్ బాలుర పాఠశాలల్లో తెలంగాణ ఓపెన్ స్కూల్ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. 10వ తరగతి, ఇంటర్మీడియట్ థియరీ పరీక్షలు అక్టోబర్ 11 నుంచి 17 వరకు జరగనున్నాయి. అక్టోబర్ 11న వృత్తి విద్యా కోర్సుల పరీక్షలు, అక్టోబర్ 12 నుంచి 17 వరకు ప్రధాన పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు అక్టోబర్ 23 నుంచి 30 వరకు జరుగుతాయని అధికారులు తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి