ఆయుష్ మెడికల్ ఆఫీసర్ సహా 6 పోస్టుల భర్తీ | అక్టోబర్ 22 నుంచి 27 వరకు దరఖాస్తుల స్వీకరణ
రామగుండం, అక్టోబర్ 17 (ఇది మన హక్కు):
పెద్దపల్లి జిల్లాలో జాతీయ ఆయుష్ మిషన్ కార్యక్రమం కింద వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జి.ఎన్. అరుణ తెలిపారు. అవుట్‌సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయనున్న ఈ పోస్టులకు అక్టోబర్ 22 నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు శనివారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు.
ఖాళీలు, వేతనాల వివరాలు
- ఆయుష్ మెడికల్ ఆఫీసర్లు: 3 పోస్టులు. నెలకు రూ.40,000 వేతనం. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా బోర్డు నుంచి ఆయుర్వేదం, యునాని, హోమియోపతి లేదా ప్రకృతి వైద్య విధానంలో నిర్దేశిత డిగ్రీతో పాటు తప్పనిసరి ఇంటర్న్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.
- ఫార్మాసిస్ట్: 1 పోస్టు. నెలకు రూ.15,000 వేతనం. డి.ఫార్మసీ, బి.ఫార్మసీ లేదా ఫార్మా-డీ ఉత్తీర్ణతతో పాటు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్ తప్పనిసరి.
- సైకోసోషల్ కౌన్సెలర్: 1 పోస్టు. ఒక్కో సెషన్‌కు రూ.500 చెల్లింపు ఉంటుంది. ఏడాదికి కనీసం 200 విజిట్లు నిర్వహించాలి. మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW) పోస్ట్‌గ్రాడ్యుయేట్ డిగ్రీ కలిగి ఉండాలి.
- యోగా ప్రొఫెషనల్: 1 పోస్టు. నెలకు రూ.28,000 వేతనం. ప్రకటనలో పేర్కొన్న నిబంధనల ప్రకారం ప్రకృతి వైద్య డిగ్రీ, యోగా సంబంధిత విద్యార్హతలు కలిగి ఉండాలి.
వయోపరిమితి, దరఖాస్తు విధానం
అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదేళ్లు, మాజీ సైనికులకు మూడేళ్ల వయోసడలింపు వర్తిస్తుందని ప్రకటనలో పేర్కొన్నారు.
దరఖాస్తు ఫారం, పూర్తి మార్గదర్శకాలను పెద్దపల్లి జిల్లా అధికారిక వెబ్‌సైట్ https://www.peddapalli.telangana.gov.in నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు రుసుము రూ.300 డిమాండ్ డ్రాఫ్ట్‌ను “GOVT. HOMOEO DISPENSARY DHARMARAM” పేరుతో తీసి దరఖాస్తుకు జత చేయాలి.
పూర్తి చేసిన దరఖాస్తుతో పాటు అవసరమైన ధ్రువపత్రాల స్వీయ ధ్రువీకరించిన జిరాక్స్ కాపీలను అక్టోబర్ 22 నుంచి 27 వరకు ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పెద్దపల్లిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో నేరుగా లేదా రిజిస్టర్డ్ పోస్టు ద్వారా సమర్పించాలి. గడువు తర్వాత అందే దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోరు.
సమర్పించాల్సిన ధ్రువపత్రాలు
10వ తరగతి, ఇంటర్మీడియట్ సర్టిఫికెట్లు, అర్హత పరీక్ష ఉత్తీర్ణత ధ్రువపత్రం, అన్ని సంవత్సరాల మార్కుల మెమోలు, కుల ధ్రువీకరణ పత్రం, 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు స్టడీ సర్టిఫికెట్లు సమర్పించాలి. ప్రైవేట్ అభ్యర్థులు నివాస ధ్రువీకరణ పత్రం అందించాలి. మెడికల్ ఆఫీసర్ పోస్టుకు సంబంధిత వైద్య మండలి రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్, ఫార్మాసిస్ట్ పోస్టుకు తెలంగాణ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జత చేయాలి. వర్తించే అభ్యర్థులు దివ్యాంగుల, మాజీ సైనికుల ధ్రువపత్రాలతో పాటు పాస్‌పోర్ట్ సైజు ఫొటో, అక్నాలెడ్జ్‌మెంట్ కార్డు సమర్పించాలి.
అభ్యర్థులు అర్హత పరీక్షల్లో సాధించిన మార్కులు, వెయిటేజీ, రిజర్వేషన్ నిబంధనల ఆధారంగా ఎంపిక చేస్తారని, మెరిట్ జాబితాను జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో ప్రచురిస్తామని జిల్లా ఆయుష్ నోడల్ అధికారి డాక్టర్ జి.ఎన్. అరుణ తెలిపారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి