సూపర్ ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఆరు నెలల కార్యాచరణ ప్రణాళిక.. ప్రత్యామ్నాయ పంటలకు కనీస మద్దతు ధర భరోసా కల్పించాలి
కరీంనగర్, అక్టోబర్ 17 (ఇది మన హక్కు): సూపర్ ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రానున్న వేసవిలో తాగునీటి కొరత తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రత్యేక అధికారి బెన్హా హుర్ మహేష్ దత్ ఎక్కా అధికారులను ఆదేశించారు. తాగునీటికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ, నీటి లభ్యత తక్కువగా ఉన్న ప్రాంతాల్లో యాసంగి వరి సాగును తగ్గించి, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని సూచించారు.
కరీంనగర్ సమీకృత జిల్లా కలెక్టరేట్‌లో శనివారం ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని నాలుగు జిల్లాల కలెక్టర్లు గరీమ అగర్వాల్, బి. సత్య ప్రసాద్, కోయ శ్రీహర్ష, చిత్ర మిశ్రాలతో కలిసి ప్రత్యేక అధికారి సమీక్ష నిర్వహించారు. వ్యవసాయం, విద్యుత్, సాగునీరు, తాగునీటి సరఫరా, భూగర్భ జలాలు, నీటి సంరక్షణ, ఉపాధి హామీ, మున్సిపాలిటీల్లో అమృత్ పనుల పురోగతిపై అధికారులు ప్రజెంటేషన్లు సమర్పించారు.
ఆరు నెలల కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలి
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో వచ్చే ఏడాది ఎదురయ్యే పరిస్థితులను ముందుగానే అంచనా వేసి, రానున్న ఆరు నెలలకు గ్రామస్థాయిలో సూక్ష్మ ప్రణాళికలు రూపొందించాలని మహేష్ దత్ ఎక్కా సూచించారు. గోదావరి, కృష్ణా నదుల్లో నీటి నిల్వలు తక్కువగా ఉన్నందున అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని తెలిపారు. భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి లభ్యతను పరిగణనలోకి తీసుకోకుండా పంటలు సాగు చేసి రైతులు నష్టపోకుండా వ్యవసాయ శాఖ అధికారులు గ్రామాల్లో విస్తృత అవగాహన కల్పించాలని ఆదేశించారు.
మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు వంటి ప్రత్యామ్నాయ పంటలను ప్రోత్సహించాలని, అవసరమైన చోట డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. ప్రత్యామ్నాయ పంటలకు అవసరమైన విత్తనాలు అందుబాటులో ఉంచడంతో పాటు, రైతులకు మార్కెటింగ్ సమస్యలు తలెత్తకుండా చూడాలని, పంటలకు కనీస మద్దతు ధర లభించేలా సంబంధిత శాఖలు పర్యవేక్షించాలని సూచించారు.
తాగునీటి అవసరాలకే నీటిని వినియోగించాలి
వచ్చే వర్షాకాలం వరకు ప్రజలకు తాగునీటి ఇబ్బందులు రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని ప్రత్యేక అధికారి స్పష్టం చేశారు. ప్రస్తుత ఖరీఫ్ పంటలను రక్షించేందుకు కాలువల ద్వారా విడుదల చేసే నీరు చివరి ఆయకట్టు వరకు చేరేలా పర్యవేక్షించాలని, మధ్యలో మోటార్ల ద్వారా నీటిని తోడకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
రానున్న నెలల్లో విద్యుత్ డిమాండ్ పెరిగే అవకాశం ఉన్నందున ట్రాన్స్‌కో, డిస్కంల మధ్య సమస్యలను పరిష్కరించి, పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని సూచించారు. విద్యుత్ ఓవర్‌లోడ్, సాంకేతిక సమస్యలు, క్షేత్రస్థాయి మరమ్మతులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి, వచ్చే ఏడు నుంచి ఎనిమిది నెలల పాటు విద్యుత్ సరఫరాలో అంతరాయాలు లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని తెలిపారు.
నీటి సంరక్షణ పనులను విస్తృతం చేయాలి
ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడంతో పాటు నీటి సంరక్షణకు ఉపయోగపడే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలని మహేష్ దత్ ఎక్కా సూచించారు. ఫామ్ పాండ్లు, మ్యాజిక్ ఇంకుడు గుంతలు, బోరు రీచార్జ్ గుంతలు, కమ్యూనిటీ సోక్ పిట్లు, రూఫ్‌టాప్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలను పెద్దఎత్తున చేపట్టాలని ఆదేశించారు. కాలువల్లో పూడిక, పిచ్చిమొక్కలు తొలగించి నీటి నిల్వ, ప్రవాహ సామర్థ్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు.
మున్సిపాలిటీల్లో అమృత్ పథకం కింద చేపట్టిన పనులను వేగవంతం చేసి, వచ్చే వేసవిలో తాగునీటి అవసరాలకు ఉపయోగపడేలా సకాలంలో పూర్తి చేయాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితిని సాధారణంగా తీసుకోకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రజలకు అవసరమైన సేవలు నిరంతరాయంగా అందేలా చూడాలని ఆదేశించారు.
పెద్దపల్లి జిల్లాలో సాధారణం కంటే 5 శాతం తక్కువ వర్షపాతం
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ జిల్లాలో 863 మి.మీ. వర్షపాతం నమోదైందని, ఇది సాధారణం కంటే 5 శాతం తక్కువని తెలిపారు. సుల్తానాబాద్‌లో 33 శాతం, ఎలిగేడులో 24 శాతం, జూలపల్లిలో 21 శాతం, మంథనిలో 20 శాతం లోటు వర్షపాతం నమోదైందని వివరించారు. ఖరీఫ్ సీజన్‌లో డ్రై స్పెల్స్ నమోదు కాకపోవడంతో ప్రస్తుతం జిల్లాలో కరువు పరిస్థితులు లేవని, పంటల పరిస్థితి సాధారణంగా ఉందని పేర్కొన్నారు.
సెప్టెంబర్ 2026 నాటికి జిల్లాలో సగటు భూగర్భ జలమట్టం 4.54 మీటర్ల లోతులో ఉందని, 12 మండలాల్లో భూగర్భ జలమట్టం ఐదు మీటర్ల లోపు ఉందని తెలిపారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలోని 2,12,036 ఎకరాల ఆయకట్టులో ప్రస్తుత ఖరీఫ్ పంటల రక్షణకు సుమారు 60 శాతం ప్రాంతానికి నీరు అందిస్తున్నట్లు చెప్పారు. శ్రీపాద ఎల్లంపల్లి జలాశయంలో 18.17 టీఎంసీల నీరు అందుబాటులో ఉందని వివరించారు.
యాసంగిలో నీటి వనరులు సరిపోని ప్రాంతాల్లో వరి సాగును తగ్గించి, మొక్కజొన్న, పప్పుధాన్యాలు, నూనెగింజలు, ఇతర ప్రత్యామ్నాయ పంటల వైపు రైతులను మళ్లించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. గ్రామస్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించడంతో పాటు, ప్రత్యామ్నాయ పంటల విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు.
గత ఏడాది సెప్టెంబర్‌తో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబర్‌లో విద్యుత్ వినియోగం 72.68 మిలియన్ యూనిట్లు పెరిగిందని కలెక్టర్ తెలిపారు. వ్యవసాయ సర్వీసులకు రోజుకు సగటున 11 గంటల పాటు త్రీ-ఫేజ్ విద్యుత్ సరఫరా చేస్తున్నామని, విద్యుత్ నెట్‌వర్క్ బలోపేతానికి 862 కొత్త డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్‌ఫార్మర్లు, 35 ఫీడర్లు, ఆరు సబ్‌స్టేషన్లు ఏర్పాటు చేసినట్లు వివరించారు.
ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు, రెవెన్యూ డివిజన్ అధికారులు, వ్యవసాయ, సాగునీటి, విద్యుత్, మిషన్ భగీరథ, భూగర్భ జలాలు, మార్కెటింగ్, పశుసంవర్ధక శాఖల అధికారులు, ఇతర సంబంధిత జిల్లా అధికారులు పాల్గొన్నారు.



కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి