ఎంబీబీఎస్ తర్వాత పీజీ వైద్య విద్యకు రామగుండం మెడికల్ కాలేజీలో సన్నాహాలు: సూపరింటెండెంట్ హిమబిందు సింగ్
మెరుగైన వైద్యం అందించడంతో పాటు రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఉన్నత వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు
రామగుండం, అక్టోబర్ 6 (ఇది మన హక్కు): పేద, మధ్యతరగతి ప్రజలకు మెరుగైన వైద్యం అందించడంతో పాటు రామగుండం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ తర్వాత పీజీ ఉన్నత వైద్య విద్య అందుబాటులోకి తీసుకురావడానికి చర్యలు కొనసాగుతున్నాయని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ హిమబిందు సింగ్ తెలిపారు. ఎమ్మెల్యే రాజ్ ఠాగూర్, జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్షల సహకారంతో వైద్య సేవలను మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.
మంగళవారం ప్రభుత్వ మెడికల్ కాలేజీ, ఆసుపత్రిలో పీజీ వైద్య విద్యకు అవసరమైన మేజర్ విభాగాలపై ఇన్స్పెక్షన్ నిర్వహించారు. గైనకాలజీ, బయోకెమిస్ట్రీ, ఆర్థోపెడిక్స్, ఎమర్జెన్సీ మెడిసిన్ విభాగాల్లో ఇప్పటికే పీజీ సీట్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ తదితర విభాగాల్లోనూ పీజీ విద్యకు అవసరమైన ఏర్పాట్లను పరిశీలించినట్లు తెలిపారు.
ఆసుపత్రిలో అత్యవసర సేవలు.
వార్డులు, వైద్య పరికరాలు, మౌలిక వసతులను మరింత బలోపేతం చేస్తున్నామని, అన్ని ప్రధాన విభాగాలకు అవసరమైన వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని హిమబిందు సింగ్ తెలిపారు. త్వరలో పీజీ ఉన్నత విద్యకు సంబంధించి మరిన్ని విభాగాలకు అనుమతులు లభించేలా చర్యలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.
రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు ప్రభుత్వ ఆసుపత్రిలో నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యమని, పేదలకు సాధ్యమైనంత వరకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందించేలా ఆసుపత్రిని మరింత అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎంవోలు, వైద్య అధికారులు, సంబంధిత సిబ్బంది పాల్గొన్నారు..




కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి