బొగ్గు రవాణా, ఓవర్‌బర్డెన్ తొలగింపులో సింగరేణి ముందంజ
తొలి అర్ధ సంవత్సరంలో బొగ్గు రవాణాలో 4 శాతం, ఓవర్‌బర్డెన్ తొలగింపులో 11 శాతం వృద్ధి.. తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు 24.58 శాతం అధికంగా బొగ్గు సరఫరా
సింగరేణి భవన్, అక్టోబర్ 01 (ఇది మన హక్కు): సెప్టెంబర్ 30తో ముగిసిన తొలి ఆర్థిక అర్ధ సంవత్సరంలో సింగరేణి సంస్థ బొగ్గు రవాణా, ఓవర్‌బర్డెన్ తొలగింపులో గణనీయమైన వృద్ధిని సాధించినట్లు సంస్థ ప్రజా సంబంధాల విభాగం తెలిపింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 287.6 లక్షల టన్నుల బొగ్గును వినియోగదారులకు రవాణా చేయగా, ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంలో 299.4 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. గత ఏడాదితో పోలిస్తే బొగ్గు రవాణాలో 4 శాతం వృద్ధి నమోదైంది.
అదేవిధంగా ఓవర్‌బర్డెన్ తొలగింపులోనూ గత ఆర్థిక సంవత్సరం తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే 11 శాతం వృద్ధి సాధించినట్లు సంస్థ పేర్కొంది.
తెలంగాణ విద్యుత్ కేంద్రాలకు అధికంగా బొగ్గు సరఫరా
తెలంగాణ రాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు గత ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 159.1 లక్షల టన్నుల బొగ్గును సరఫరా చేసిన సింగరేణి, ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ సూచన మేరకు 198.2 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసింది. ఇది గత ఏడాది సరఫరా చేసిన పరిమాణంతో పోలిస్తే 24.58 శాతం అధికమని సంస్థ తెలిపింది.
రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యతనిస్తూ థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాపై సింగరేణి ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది.
విద్యుత్ కేంద్రాల వారీగా బొగ్గు రవాణా
కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి గత ఏడాది తొలి అర్ధ సంవత్సరంలో 26.4 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా, ఈ ఏడాది 39.8 లక్షల టన్నులు సరఫరా చేసింది. దీంతో 50.76 శాతం వృద్ధి నమోదైంది.
యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి గత ఏడాది 21.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా, ఈ ఏడాది 33.9 లక్షల టన్నులు సరఫరా చేసింది. ఇది 57.67 శాతం వృద్ధి.
మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు గత ఏడాది 19.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా, ఈ ఏడాది 24.4 లక్షల టన్నులు సరఫరా చేసింది. 25.13 శాతం వృద్ధి నమోదైంది.
సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 27.27 శాతం వృద్ధితో 26.6 లక్షల టన్నుల బొగ్గును రవాణా చేసినట్లు సంస్థ తెలిపింది.
ఎన్టీపీసీ తెలంగాణ ప్లాంట్‌కు గత ఏడాది ఇదే కాలంలో 19.4 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా, ఈ ఏడాది 25.3 లక్షల టన్నులు సరఫరా చేసింది. అయితే ఎన్టీపీసీ రామగుండం ప్లాంట్‌కు గత ఏడాది సెప్టెంబర్ చివరి నాటికి 43.5 లక్షల టన్నుల బొగ్గు సరఫరా చేయగా, ఈ ఏడాది 42.7 లక్షల టన్నులు సరఫరా చేసినట్లు సంస్థ వివరించింది.
బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ప్రత్యేక దృష్టి
ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వాలని విద్యుత్ సంస్థలతో సమన్వయం చేస్తూ, విద్యుత్ ప్లాంట్లకు అవసరమైన బొగ్గును సాధ్యమైనంత మేరకు సరఫరా చేయాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు సింగరేణి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు సంస్థ తెలిపింది.
ప్రతిరోజూ సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి అన్ని ఏరియాల జీఎంలతో సమీక్షిస్తూ ఉత్పత్తి లక్ష్యాల సాధనతో పాటు బొగ్గు రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని పేర్కొంది. థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సజావుగా రవాణా జరిగేలా ఐదుగురు ఉన్నతాధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించి పర్యవేక్షణ చేపడుతున్నట్లు తెలిపింది.
సింగరేణి సంస్థ బొగ్గు అమ్మకాలను కేవలం వ్యాపార దృక్పథంతో కాకుండా రాష్ట్ర విద్యుత్ అవసరాలను తీర్చడాన్ని నైతిక బాధ్యతగా భావిస్తూ స్వరాష్ట్రంలోని థర్మల్ విద్యుత్ కేంద్రాలకు అధిక శాతం బొగ్గును రవాణా చేస్తోందని సంస్థ పేర్కొంది.
620 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యం
ఏడాదికి నిర్దేశించిన 620 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 650 లక్షల టన్నుల బొగ్గు రవాణా లక్ష్యాలను సాధించేందుకు పూర్తి ప్రణాళికతో ముందుకు సాగుతున్నట్లు సంస్థ ఛైర్మన్, ఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి తెలిపారు..


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి