యాసంగి సాగు ప్రణాళికపై అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దిశానిర్దేశం
పెద్దపల్లి, అక్టోబర్ 12 (ఇది మన హక్కు):
సూపర్ ఎల్‌నినో ప్రభావంతో తాగునీరు, సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. సోమవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో యాసంగి 2026–27 పంటల సాగు ప్రణాళికపై రైతులు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. సుల్తానాబాద్ మండలం కనుకుల రైతు వేదిక నుంచి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
భూగర్భ జలాలు తగ్గుతున్న నేపథ్యంలో నీటి లభ్యతను బట్టి రైతులు పంటల సాగుపై నిర్ణయం తీసుకోవాలని డిప్యూటీ సీఎం సూచించారు. నీరు అందుబాటులో లేని ప్రాంతాల్లో అధిక నీటి అవసరమున్న పంటలకు బదులుగా ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని కోరారు. రానున్న జూన్ వరకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు ముందస్తు ప్రణాళికలు రూపొందించాలని, పశువులకు తాగునీరు, మేత అందేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పప్పుధాన్యాలు, నూనెగింజలు, కూరగాయలు, ఉద్యాన పంటలు, ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించాలని సూచించారు. డ్రిప్, స్ప్రింక్లర్ వంటి సూక్ష్మ సేద్య పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించాలని, విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు తాగునీటి సరఫరా, విద్యుత్, వ్యవసాయం, పశుసంవర్ధక శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. గ్రామాల్లో ఉపాధి హామీ పనులను విస్తృతం చేసి నీటి సంరక్షణ, చెరువులు, కుంటల్లో పూడికతీత, ఇతర నీటి నిల్వ పనులు చేపట్టాలని సూచించారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్, ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, డీసీవో శ్రీమాల, ఎస్సీ ఎన్పీడీసీఎల్ అధికారి గంగాధర్‌తో పాటు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి