పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
ఇంటిపై సోలార్ పలకల ఏర్పాటుకు స్పాట్ రిజిస్ట్రేషన్.. సేవా సేతు క్యాంప్‌లను వినియోగించుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచన
పెద్దపల్లి, అక్టోబర్ 01 (ఇది మన హక్కు): ప్రతి విద్యుత్ వినియోగదారుడు పీఎం సూర్య ఘర్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సూచించారు.
గురువారం పెద్దపల్లి పట్టణంలోని జండా చౌరస్తా సమీపంలోని విద్యుత్ కార్యాలయంలో నిర్వహించిన పీఎం సూర్య ఘర్ కార్యక్రమంలో కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న మూడు రోజుల సేవా సేతు అభియాన్ క్యాంప్‌లను విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటిపై సోలార్ పలకలు ఏర్పాటు చేసుకునేందుకు క్యాంప్‌లో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం ఉందన్నారు. సోలార్ విద్యుత్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు.
ఎన్పీడీసీఎల్, టీజీ రెడ్కో అధికారులు, బ్యాంకర్లు, సోలార్ వెండర్లు ఒకే వేదికపై అందుబాటులో ఉండటంతో ప్రజలకు అవసరమైన సమాచారం, సేవలు ఒకేచోట లభిస్తున్నాయని తెలిపారు. ఈ అవకాశాన్ని ప్రతి విద్యుత్ వినియోగదారుడు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు.
ముఖ్యంగా పట్టణ ప్రాంతాలు, ఉద్యోగులు అధికంగా నివసించే కాలనీల్లో ఇంటింటికీ వెళ్లి పీఎం సూర్య ఘర్ పథకం, సోలార్ విద్యుత్ వినియోగంపై విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు.
కార్యక్రమంలో ఎస్ఈ గంగాధర్, డీఈ బాలయ్య, ఏడీఈ మల్లేశం, లీడ్ బ్యాంక్ మేనేజర్ ప్రవీణ్, సోలార్ వెండర్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి