అటవీ రక్షణ–ఉత్పత్తి–పరిరక్షణపై అవగాహన కల్పించిన వన్యప్రాణి వారోత్సవం
ఓరుగల్లు పందెం, అక్టోబర్ 7 (ఇది మన హక్కు):
72వ, జాతీయ వన్యప్రాణి వారోత్సవాల సందర్భంగా అటవీ శాఖ మరియు ఒరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (ఔల్స్) సంయుక్త ఆధ్వర్యంలో పందెం అటవీ ప్రాంతంలో బుధవారం “నేచర్ వాక్ – ఫారెస్ట్ బాత్” కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అటవీ ప్రాంతంలో సుమారు 5 కిలోమీటర్ల నడక, ట్రెక్కింగ్ నిర్వహిస్తూ ప్రకృతి, అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పించారు. అటవీ ప్రాంతంలో నడక ద్వారా అడవుల జీవవైవిధ్యం, వృక్షజాలం, వన్యప్రాణుల ఆవాసాలు, పక్షులు, కీటకాలు, నేల మరియు నీటి వనరుల ప్రాధాన్యతను ప్రత్యక్షంగా పరిశీలించారు. అడవిని కేవలం కలప వనరుగా కాకుండా జీవావరణ వ్యవస్థగా చూడాల్సిన అవసరం ఉందని కార్యక్రమంలో పాల్గొన్న వారు పేర్కొన్నారు.
రక్షణ–ఉత్పత్తి–పరిరక్షణే లక్ష్యం
అడవుల రక్షణతోనే నీటి వనరులు, నేల సారం, జీవవైవిధ్యం, వన్యప్రాణుల ఆవాసాలు మరియు మానవ జీవనం సురక్షితంగా ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. అటవీ సంపదను శాస్త్రీయంగా, స్థిరమైన పద్ధతుల్లో వినియోగిస్తూ అటవీ ఉత్పత్తులను కాపాడటం, అక్రమ వేట–చెట్ల నరికివేత–అగ్నిప్రమాదాలను అరికట్టడం, సహజ ఆవాసాలను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని వివరించారు. అడవుల్లో ప్లాస్టిక్, చెత్త వేయకుండా చూడటం, అగ్ని ప్రమాదాల పట్ల అప్రమత్తంగా ఉండటం, వన్యప్రాణులకు ఇబ్బంది కలిగించకుండా వాటి సహజ ఆవాసాలను గౌరవించడం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. “అడవి ఉంటేనే వన్యప్రాణులు ఉంటాయి; వన్యప్రాణులు ఉంటేనే జీవవైవిధ్యం ఉంటుంది; జీవవైవిధ్యం ఉంటేనే మానవ జీవనం సురక్షితంగా ఉంటుంది” అనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారు.
ప్రకృతిలో కొంత సమయం గడపడం ద్వారా మానసిక ప్రశాంతతతో పాటు ప్రకృతి పట్ల బాధ్యత, అనుబంధం పెరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. యువత, విద్యార్థులు, స్థానిక ప్రజలు ఇలాంటి ప్రకృతి కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో పాల్గొని అడవుల సంరక్షణకు భాగస్వాములు కావాలని ఔల్స్ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్-ప్రెసిడెంట్ ఇందారం నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన DFO శ్రీమతి లావణ్య, IFS, FDO శ్రీ వెంకటేశ్వర్లు, FRO శ్రీమతి మయూరి, Dy.RO శ్రీ శ్రీనివాస్ రెడ్డి, FSOలు, బీట్ ఆఫీసర్ లు ప్రకృతి, అటవీ ప్రేమికులు, అటవీ సందర్శకులు మరియు ఇతర అటవీ శాఖ పాల్గొనగా సిబ్బందికి, తదితరులకు నాగేశ్వరావు ఔల్స్ తరఫున కృతజ్ఞతలు తెలిపారు.
“అడవులను రక్షిద్దాం – వన్యప్రాణులను కాపాడుదాం – ప్రకృతిని పరిరక్షిద్దాం – భవిష్యత్ తరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందిద్దాం” అనే సందేశంతో కార్యక్రమం కొనసాగింది.
— ఒరుగల్లు వైల్డ్‌లైఫ్ సొసైటీ (OWLS)




కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి