ఆర్జీ-1 ఏరియాలో స్వీట్ల పంపిణీ, బాణాసంచా కాల్చి వేడుకలు.. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్‌కు కార్మిక వర్గం కృతజ్ఞతలు
గోదావరిఖని, అక్టోబర్ 13 (ఇది మన హక్కు):
సింగరేణి కార్మికులకు 2025–26 ఆర్థిక సంవత్సరానికి 34 శాతం లాభాల వాటా ప్రకటించడంతో రామగుండం ఆర్జీ-1 ఏరియాలోని బొగ్గు గనుల వద్ద సంబరాలు నిర్వహించారు. స్వీట్లు పంపిణీ చేసి, బాణాసంచా కాల్చిన కార్మికులు రాష్ట్ర ప్రభుత్వానికి, రామగుండం ఎమ్మెల్యే ఎం.ఎస్. రాజ్ ఠాకూర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.
2025–26 ఆర్థిక సంవత్సరంలో సింగరేణికి రూ.1,754 కోట్ల లాభాలు వచ్చిన నేపథ్యంలో కార్మికులకు 34 శాతం లాభాల వాటా ప్రకటించినట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్జీ-1 ఏరియాలోని వివిధ గనుల వద్ద ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ బృందం ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
కార్మికులకు పలు ప్రయోజనాలు ప్రకటించినట్లు వెల్లడి
ఈ సందర్భంగా మేయర్ మహంకాళి స్వామి మాట్లాడుతూ, సగటున ఒక్కో కార్మికుడికి రూ.1,54,000 లాభాల వాటా అందనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టు కార్మికులకు రూ.5,500 ప్రకటించినట్లు పేర్కొన్నారు.
సింగరేణి కార్మికులు మెడికల్ బోర్డు కోసం కొత్తగూడెం వెళ్లాల్సిన అవసరం లేకుండా ఏరియా ఆసుపత్రిలోనే వైద్య బోర్డు నిర్వహించే అంశం, కార్మికుల సొంతింటి కల సాకారం, ఆదాయపు పన్నులో పెర్క్విజిట్స్ మినహాయింపు, పెండింగ్ మారుపేర్ల సమస్య పరిష్కారం వంటి అంశాలపై చర్యలు చేపడుతున్నట్లు వివరించారు.
డిస్మిస్ అయిన కార్మికులకు వన్‌టైమ్ సెటిల్మెంట్ ద్వారా తిరిగి ఉద్యోగావకాశం కల్పించడం, అధికారులకు పీఆర్పీ చెల్లింపు, పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల నియామక పత్రాల పంపిణీ, ఏరియా ఆసుపత్రులను సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులుగా అభివృద్ధి చేయడం, శిథిలావస్థలో ఉన్న డీ-టైప్ క్వార్టర్ల ఆధునికీకరణ వంటి అంశాలను కూడా ప్రస్తావించారు.
పెండింగ్‌లో ఉన్న డిపెండెంట్ ఉద్యోగాల నియామక పత్రాలను 15 రోజుల్లో పంపిణీ చేయనున్నట్లు తెలిపారని పేర్కొన్నారు.
కార్మికుల సంక్షేమానికి కృషి చేస్తాం
సింగరేణి కార్మికుల సంక్షేమం, వారి హక్కుల పరిరక్షణకు అండగా ఉంటామని నాయకులు తెలిపారు. కార్మికులకు ప్రకటించిన ప్రయోజనాలు అమలయ్యేలా కృషి చేస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నగర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎం.డి. ముస్తఫా, రాజ్ ఠాకూర్ బృందం సభ్యులు జనగామ శ్రీనివాస్, అరగంటి కృష్ణ, పాకాల సాయికుమార్, గడ్డం కృష్ణ, ధార సుశీల, గోషికే కనకయ్య, మండ రమేష్ గౌడ్, బద్రి శంకర్, ఎల్. ఆంజనేయులు, పోతారుబోయిన సమ్మయ్య, పైడిపెల్లి అశోక్, పాల్, రమేష్, సంపత్, శ్రీనివాస్, జగన్‌తో పాటు నాయకులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.





కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి