ఇది మన హక్కు పెద్దపల్లి బ్యూరో రిపోర్టర్✍️
విద్యార్థి లోకానికి – నిరుద్యోగుల పోరాటానికి దక్కిన విజయం: సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం
పెద్దపల్లి, జూలై 25 (ఇది మన హక్కు):
ఎన్టీఏ నిర్వహించిన నీట్ (NEET-UG) వంటి జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొన్న పేపర్ లీకేజీలు, అవకతవకల నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారంటూ వస్తున్న పరిణామాలను దేశంలోని కోట్లాది మంది విద్యార్థులు, నిరుద్యోగుల సుదీర్ఘ పోరాటానికి దక్కిన విజయంగా సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అభివర్ణించారు.
సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద విద్యార్థి సంఘాలు, యువజన సంఘాలు చేపట్టిన ఆందోళనల ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం దిగివచ్చిందని పేర్కొన్నారు.
కేవలం మంత్రి రాజీనామాతో సరిపెట్టకుండా, పేపర్ లీకేజీల వెనుక ఉన్న అసలు సూత్రధారులను, మాఫియాను గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీల కారణంగా పరీక్షలు రద్దై తీవ్ర మానసిక వేదనకు గురై ఆత్మహత్యలకు పాల్పడినట్లు పేర్కొంటున్న 21 మంది విద్యార్థుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం ఒక్కో కుటుంబానికి రూ.1 కోటి చొప్పున ఆర్థిక సహాయం అందించాలని కోరారు.
జూలై 20న ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై పోలీసులు లాఠీచార్జి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ, బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే దేశంలో భవిష్యత్తులో ఎలాంటి ప్రభుత్వ లేదా అర్హత పరీక్షల్లో పేపర్ లీకేజీలు జరగకుండా పార్లమెంట్లో పటిష్టమైన చట్టం తీసుకురావాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ)ని సమూలంగా ప్రక్షాళన చేయాలని కోరారు.
దేశ భవిష్యత్తు అయిన విద్యార్థుల జీవితాలతో ఆడుకునే ప్రభుత్వాలకు యువశక్తి తగిన గుణపాఠం చెబుతుందని ఈ పరిణామాలు నిరూపించాయని పేర్కొన్న ఆయన, ప్రజా సమస్యలపై సెప్టెంబర్‌లో నిర్వహించనున్న "చలో ఢిల్లీ" కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు..
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి