ఇది మన హక్కు పెద్దపల్లి జిల్లా బ్యూరో రిపోర్టర్✍️
భారీ వర్షాలపై హై అలర్ట్.. ప్రజల భద్రతే తొలి ప్రాధాన్యం: డీసీపీ బి. రామ్‌రెడ్డి
వరద ప్రభావిత ప్రాంతాల పరిశీలన.. అవసరం లేకుంటే బయటకు రావొద్దని ప్రజలకు సూచన
గోదావరిఖని, జూలై 29 (ఇది మన హక్కు): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని పెద్దపల్లి డీసీపీ బి. రామ్‌రెడ్డి పిలుపునిచ్చారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఆయన, ప్రజల భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
డీసీపీ బి. రామ్‌రెడ్డి, రామగుండం నగరపాలక సంస్థ కమిషనర్ జె. అరుణశ్రీ, మేయర్ మహంకాళి స్వామి, గోదావరిఖని ఏసీపీ మడత రమేష్, వన్‌టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డితో కలిసి మల్కాపూర్, ప్రభుత్వ మెడికల్ కళాశాల పరిసరాలు, 5 ఇంక్లైన్ తదితర ప్రాంతాల్లో పర్యటించి వరద పరిస్థితిని సమీక్షించారు. నీరు రోడ్డుపైకి చేరిన ప్రాంతాలను పరిశీలించి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా డీసీపీ మాట్లాడుతూ, భారీ వర్షాల కారణంగా వాగులు, వంకలు, చెరువులు, గోదావరి, మానేరు నదుల్లో వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉందని, ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ వాటి వద్దకు వెళ్లవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా యువత సెల్ఫీలు, ఈత కోసం నీటి ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాల కారణంగా రోడ్లు జారుడుగా మారే అవకాశం ఉన్నందున వాహనదారులు పరిమిత వేగంతో ప్రయాణించాలని, అవసరం అయితే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఎలాంటి అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే డయల్–100 లేదా సమీప పోలీస్ స్టేషన్‌ను సంప్రదించాలని తెలిపారు.
ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణే ప్రధాన లక్ష్యంగా పోలీసు, మున్సిపల్, రెవెన్యూ శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నాయని, వర్షాలు తగ్గే వరకు ప్రతి ఒక్కరూ అధికారుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని డీసీపీ బి. రామ్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు..
కామెంట్లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి