భద్రతతోనే ఉత్పత్తి లక్ష్యాల సాధన.. సింగరేణి గనుల్లో పనితీరు మెరుగుపర్చాలి: డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ
ఇది మన హక్కు పెద్దపల్లి జిల్లా బ్యూరో రిపోర్టర్✍️
భద్రతతోనే ఉత్పత్తి లక్ష్యాల సాధన.. సింగరేణి గనుల్లో పనితీరు మెరుగుపర్చాలి: డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ
రామగుండం–3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల్లో విస్తృత పర్యటన.. బొగ్గు ఉత్పత్తి, లాంగ్‌వాల్ పనులపై సమీక్ష
రామగిరి, జూలై 28 (ఇది మన హక్కు):
సింగరేణిలో నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను భద్రతకు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తూ సాధించాలని సింగరేణి డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎల్.వి. సూర్యనారాయణ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన రామగుండం–3 ఏరియా మరియు అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో విస్తృతంగా పర్యటించి ఉత్పత్తి, రవాణా, గనుల అభివృద్ధి పనుల పురోగతిని సమీక్షించారు.
పర్యటన సందర్భంగా రామగుండం–3 ఏరియా జనరల్ మేనేజర్ సుంకర మధుసూదన్, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్ కొలిపాక నాగేశ్వరరావు డైరెక్టర్‌కు స్వాగతం పలికారు. అనంతరం ఇరు ఏరియాల ఉన్నతాధికారులతో సమావేశమై బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత, రవాణా వ్యవస్థ, జీడీకే-10 గని పనుల పురోగతి, ఆర్‌జీ కోల్ మైన్ కార్యకలాపాలు తదితర అంశాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.
తదుపరి అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్ గనిని సందర్శించిన డైరెక్టర్, అక్కడ జరుగుతున్న మూడో ప్యానల్ సాల్వేజింగ్ పనులు, నాలుగో ప్యానల్ తయారీ పనులు మరియు భవిష్యత్ ఉత్పత్తి ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. పనులు వేగవంతంగా పూర్తి చేసి నిరంతర ఉత్పత్తికి ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ ఎల్.వి. సూర్యనారాయణ మాట్లాడుతూ, ఓవర్‌బర్డెన్ (OB) తొలగింపు, బొగ్గు ఉత్పత్తి లక్ష్యాలను సాధించేందుకు అందుబాటులో ఉన్న యంత్రాలను పూర్తిస్థాయిలో వినియోగించాలని సూచించారు. ప్రతి గనిలో ముందస్తు కార్యాచరణ ప్రణాళిక రూపొందించి, ఉత్పత్తి పెంపుతో పాటు భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని ఆదేశించారు.
ప్రస్తుతం వర్షాకాలం కొనసాగుతున్నందున ఉపరితల గనుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షాల ప్రభావంతో ఎలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ముఖ్యంగా అడ్రియాల లాంగ్‌వాల్ ప్రాజెక్ట్‌లో సాల్వేజింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి, భద్రతతో కూడిన ఉత్పత్తి లక్ష్యాలను సాధించే దిశగా సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌వోటూజీఎం బండి సత్యనారాయణ, ప్రాజెక్ట్ ఆఫీసర్ ప్రవీణ్ వి. ఫ్యాటింగ్, ప్రాజెక్ట్ ఇంజినీర్ టి. రఘురామ్తో పాటు రామగుండం–3, అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాల అధికారులు, సాంకేతిక నిపుణులు తదితరులు పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి