కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు – హెచ్‌ఎంఎస్ ఆగ్రహంకోల్ ఇండియా ఒప్పంద వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

కాంట్రాక్ట్ కార్మికులను మోసం చేస్తున్న ప్రభుత్వాలు – హెచ్‌ఎంఎస్ ఆగ్రహం
కోల్ ఇండియా ఒప్పంద వేతనాలు వెంటనే అమలు చేయాలని డిమాండ్

ఈరోజు ఉదయం 10 గంటలకు చౌరస్తాలోని హెచ్‌ఎంఎస్ కార్యాలయంలో ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ ఆరేళ్లి పోషం ఆధ్వర్యంలో హెచ్‌ఎంఎస్ జనరల్ సెక్రటరీ కామ్రేడ్ రియాజ్ అహ్మద్ ముఖ్య అతిథిగా పత్రికా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కామ్రేడ్ రియాజ్ అహ్మద్ మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ కార్మికులకు వేతనాలు పెంచినట్లు ప్రభుత్వం ప్రచారం చేస్తూ కార్మికులను మోసం చేస్తోందని ఆరోపించారు.

కోల్ ఇండియాలో హెచ్‌ఎంఎస్‌తో పాటు జేబీసీసీఐ సంఘాలు కుదుర్చుకున్న వేతన ఒప్పందాలను అమలు చేయకుండా, తక్కువ వేతనాలు ప్రకటించడం అన్యాయమన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం రెండూ కాంట్రాక్ట్ కార్మికుల కడుపుకొట్టి కాంట్రాక్టర్ల జేబులు నింపుతున్నాయని విమర్శించారు.

అంతర్జాతీయ కార్మిక సంస్థ (ILO) సూచనలను పరిగణనలోకి తీసుకోకుండా, కేంద్ర కార్మిక సంఘాలతో సంప్రదించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం సరైంది కాదన్నారు. తక్కువ వేతనాలు ప్రకటించి గొప్పలు చెప్పుకుంటున్న అధికార, భాగస్వామ్య సంఘాలు కార్మికుల ప్రయోజనాలను విస్మరిస్తున్నాయని, వారి నిశ్శబ్దం కార్మిక వ్యతిరేక వైఖరికి నిదర్శనమన్నారు.

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన వేతనాలు:
• అన్ స్కిల్డ్ – ₹16,000
• సెమీ స్కిల్డ్ – ₹17,000
• స్కిల్డ్ – ₹18,500
• హైలీ స్కిల్డ్ – ₹20,000

కోల్ ఇండియాలో హెచ్‌ఎంఎస్, జేబీసీసీఐ ఒప్పంద వేతనాలు:
• అన్ స్కిల్డ్ – ₹33,410
• సెమీ స్కిల్డ్ – ₹34,242
• స్కిల్డ్ – ₹35,100
• హైలీ స్కిల్డ్ – ₹35,958

ప్రభుత్వం వెంటనే కోల్ ఇండియా తరహా వేతనాలు అమలు చేసి కాంట్రాక్ట్ కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ బోనగిరి సమ్మయ్య, ఆర్జీ-1 వైస్ ప్రెసిడెంట్ ఆరేళ్లి పోషం, బ్రాంచ్ సెక్రటరీ పల్లె క్రాంతి కుమార్, పిట్ కార్యదర్శులు రాంచందర్ రావు, మహేందర్, నాగేందర్, వరప్రసాద్ రావు, సంపత్, నాయకులు గట్టు స్వామి, తిరుపతి, సాగర్, వంశీ, శ్రీనివాస్, విష్ణువర్ధన్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు