🔴 విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటమా..? NEET వివాదంపై కేంద్రాన్ని నిలదీసిన యూఎస్‌ఎఫ్‌ఐ.. 24న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు పిలుపు
నంద్యాల, జూలై 22 (ఇది మన హక్కు): దేశవ్యాప్తంగా విద్యార్థుల్లో తీవ్ర ఆందోళనకు దారితీసిన NEET-UG పేపర్ లీకేజీ, పరీక్షల నిర్వహణలో చోటుచేసుకున్న లోపాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని యునైటెడ్ స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (USFI) డిమాండ్ చేసింది. దేశ విద్యా వ్యవస్థ విశ్వసనీయతను దెబ్బతీసే ఘటనలపై కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని యూఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి విమర్శించారు..ఢిల్లీలో నిరసన చేపట్టిన విద్యార్థులపై పోలీసుల చర్యలను ఖండిస్తూ జూలై 24న ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రభావితం చేసే అంశాలపై కేంద్ర ప్రభుత్వం పారదర్శకంగా స్పందించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, పరీక్షల నిర్వహణలో విద్యార్థుల విశ్వాసాన్ని కాపాడేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు..ఈ కార్యక్రమంలో యూఎస్‌ఎఫ్‌ఐ నంద్యాల జిల్లా అధ్యక్షుడు జైసింహారెడ్డి, జిల్లా కార్యదర్శి సురేంద్ర నాయక్, నాయకులు దేవానంద్, సురేష్, పవన్, నరేష్, శివ తదితరులు పాల్గొన్నారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి