29, జులై 2026, బుధవారం

భారీ వర్షాలపై హై అలర్ట్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్రస్థాయి పర్యటన

 ఇది మన హక్కు బ్యూరో చీఫ్✍️

భారీ వర్షాలపై హై అలర్ట్.. వరద ప్రభావిత ప్రాంతాల్లో పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా క్షేత్రస్థాయి పర్యటన

మంచిర్యాల, జూలై 29 (ఇది మన హక్కు): ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అప్రమత్తమైంది. పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంచిర్యాల పట్టణంలోని పాత మంచిర్యాల రాళ్లవాగు ప్రాంతాన్ని సందర్శించి వరద పరిస్థితిని సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాళ్లవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నందున ప్రజల భద్రత దృష్ట్యా ప్రమాదకర ప్రాంతాలను పూర్తిగా మూసివేసి, అవసరమైన చోట్ల ట్రాఫిక్ మళ్లింపులు అమలు చేస్తున్నామని తెలిపారు. ప్రజలు పోలీసుల సూచనలు తప్పనిసరిగా పాటించాలని, అవసరం అయితే తప్ప వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లవద్దని సూచించారు.

వాతావరణ శాఖ మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించిన నేపథ్యంలో కోటపల్లి, నీల్వాయి ప్రాంతాల్లో ప్రాణహిత నది నీటి మట్టాన్ని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. అవసరమైతే ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను మోహరించేందుకు సిద్ధంగా ఉన్నామని, పోలీస్ కమిషనరేట్ పరిధిలో శిక్షణ పొందిన సిబ్బంది అత్యవసర సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు.

ప్రజలకు ఎలాంటి అత్యవసర పరిస్థితులు ఎదురైనా వెంటనే స్పందించేలా పోలీసు అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నారని కమిషనర్ తెలిపారు. ఈ పర్యటనలో మంచిర్యాల డీసీపీ ఎ. భాస్కర్, ఏసీపీ ఆర్. ప్రకాష్, పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

ఇది మన హక్కు సమాచార పత్రిక✍️

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి