ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత నిర్మించుకోవాలి: మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ అరుణ శ్రీ
వర్షపు నీటిని భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవాలి.. ఇంకుడు గుంత నిర్మించి వివరాలు సమర్పిస్తే డిపాజిట్ రుసుము తిరిగి చెల్లింపు
రామగుండం, జూలై 31 (ఇది మన హక్కు): భూగర్భ జల మట్టం పెంపొందించేందుకు ప్రతి ఇంట్లో తప్పనిసరిగా ఇంకుడు గుంత (రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ పిట్) నిర్మించుకోవాలని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి, కమిషనర్ జె. అరుణ శ్రీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో వారు మాట్లాడుతూ, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని నివాస గృహాలు, అపార్ట్‌మెంట్లు, వాణిజ్య సముదాయాలు, విద్యాసంస్థలు, ఇతర భవనాల్లో వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని కోరారు.
భవన నిర్మాణ అనుమతి సమయంలో ఇంకుడు గుంత నిర్మాణానికి సంబంధించి డిపాజిట్ రుసుము చెల్లించిన వారు నిర్మాణం పూర్తిచేసి ఫోటోలు, వివరాలు సమర్పిస్తే ఆ డిపాజిట్ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని తెలిపారు.
'జల్ సంచయ్ జన భాగీదారి' కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ ఆదేశాల మేరకు రామగుండం నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రాంతాల్లో వర్షపు నీటి సంరక్షణ పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.
ప్రస్తుతం కురుస్తున్న విస్తారమైన వర్షాలను దృష్టిలో ఉంచుకుని ప్రతి నీటి బొట్టును భూగర్భ జలాల్లోకి ఇంకేలా చర్యలు తీసుకోవడం అత్యంత అవసరమని, ప్రజలు స్వచ్ఛందంగా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు. ఇప్పటికే వర్షపు నీటి సంరక్షణ నిర్మాణాలు ఏర్పాటు చేసుకున్న వారు వాటిని శుభ్రపరచి సక్రమంగా పనిచేసేలా నిర్వహించుకోవాలని సూచించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి