రత్నాపూర్ అభివృద్ధికి ప్రభుత్వం అండగా నిలవాలి – మంత్రి శ్రీధర్ బాబుకు సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు వినతి
ఖిల్లా ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక నిరుద్యోగులకు ఉద్యోగాల్లో ప్రాధాన్యం కల్పించాలని విజ్ఞప్తి – సానుకూలంగా స్పందించిన మంత్రి
రామగిరి, జూలై 27 (ఇది మన హక్కు): రత్నాపూర్ గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రత్యేక సహకారం అందించాలని, రామగిరి ఖిల్లా ప్రాంతంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న ఇండస్ట్రియల్ పార్కులో స్థానిక నిరుద్యోగ యువతకు ఉద్యోగాల్లో మొదటి ప్రాధాన్యత కల్పించాలని రత్నాపూర్ గ్రామ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబును మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రాలు సమర్పించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రత్నాపూర్ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సదుపాయాలు, వీధి దీపాలు, కమ్యూనిటీ మౌలిక వసతులు, ఇతర అభివృద్ధి పనులకు ప్రభుత్వం ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.
అదేవిధంగా రామగిరి ఖిల్లా ప్రాంతంలో ఏర్పాటు కానున్న ఇండస్ట్రియల్ పార్క్ స్థానిక యువతకు ఉపాధి కల్పించేలా ఉండాలని, ఇతర ప్రాంతాల వారికి కాకుండా ముందుగా స్థానిక అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పరిశ్రమలకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇవ్వాలని కోరారు. పరిశ్రమల ఏర్పాటు వల్ల పరిసర గ్రామాల ఆర్థిక పరిస్థితి మెరుగుపడటంతో పాటు యువత వలసలు కూడా తగ్గుతాయని వివరించారు.
వినతిపై మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సానుకూలంగా స్పందిస్తూ, రత్నాపూర్ గ్రామ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని హామీ ఇచ్చారు. గ్రామంలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చి దశలవారీగా పూర్తి చేస్తామని, ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుతో స్థానిక యువతకు అత్యధిక ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు స్థానిక ప్రజలకు ఉపాధి, ప్రాంతీయ అభివృద్ధి రెండూ సమానంగా జరిగేలా ప్రభుత్వం కృషి చేస్తుందని స్పష్టం చేశారు.
మంత్రి ఇచ్చిన హామీతో రత్నాపూర్ గ్రామ అభివృద్ధికి కొత్త ఊపిరి లభిస్తుందని, గ్రామ ప్రజల చిరకాల కోరికలు నెరవేరే దిశగా అడుగులు పడతాయని సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామ ప్రతినిధులు పాల్గొన్నారు...
ఇది మన హక్కు సమాచార పత్రిక మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్ వడ్లకొండ మహేందర్ గౌడ్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి