24, జులై 2026, శుక్రవారం

🚦హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం.. ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి: గోదావరిఖని పోలీసులు

హెల్మెట్ తప్పనిసరి.. ప్రతి ప్రయాణంలో ప్రాణాలకు రక్షణ: గోదావరిఖని పోలీసుల అవగాహన కార్యక్రమం..
ఇది మన హక్కు సమాచార పత్రిక✍️

హెల్మెట్ మీ ప్రాణాలకు రక్షణ కవచం.. ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా ధరించండి: గోదావరిఖని పోలీసులు

గోదావరిఖని, జూలై 24 (ఇది మన హక్కు): రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టాన్ని తగ్గించాలంటే ప్రతి ద్విచక్ర వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, నాలుగు చక్రాల వాహనాల్లో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్‌బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు పిలుపునిచ్చారు. ప్రజల భద్రతే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, జరిమానాలు విధించడం కేవలం నిబంధనల అమలులో భాగమే తప్ప అసలు ఉద్దేశం కాదని స్పష్టం చేశారు...రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జోన్, గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తాలో శుక్రవారం విస్తృత ట్రాఫిక్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు నాయకత్వం వహించారు. ద్విచక్ర వాహనదారులతో నేరుగా మాట్లాడిన పోలీసులు హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలను వివరించి అవగాహన కల్పించారు..ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ, "హెల్మెట్ లేకుండా చిన్న దూరం మాత్రమే వెళ్తున్నాం, గల్లీల్లో తిరుగుతున్నాం కాబట్టి అవసరం లేదు" అనే భావన పూర్తిగా తప్పని తెలిపారు. ప్రమాదం ఎప్పుడు, ఎక్కడ, ఏ పరిస్థితిలో సంభవిస్తుందో ఎవరూ ముందుగా చెప్పలేరని, చిన్న ప్రయాణంలో కూడా ప్రాణాంతక ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు..హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదాల సమయంలో తలకు తీవ్ర గాయాలు కావడం, ప్రాణాలు కోల్పోవడం వంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయని పేర్కొన్నారు. ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదాలను ఉదాహరణగా ప్రస్తావిస్తూ, ఒకరి నిర్లక్ష్యం మొత్తం కుటుంబాన్ని విషాదంలోకి నెట్టివేస్తుందని అన్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలను బాధ్యతగా పాటించాలని సూచించారు..ట్రాఫిక్ నిబంధనలు ప్రధాన రహదారులకే పరిమితం కావని, ప్రతి వీధి, ప్రతి కాలనీ, ప్రతి రహదారిలో సమానంగా అమలులో ఉంటాయని పోలీసులు స్పష్టం చేశారు. జరిమానాల భయంతో అయినా హెల్మెట్ ధరించే అలవాటు చేసుకుంటే చివరికి అదే వారి ప్రాణాలను కాపాడుతుందని పేర్కొన్నారు...ద్విచక్ర వాహనదారులు నాణ్యమైన ఐఎస్ఐ (ISI) ప్రమాణాలు కలిగిన హెల్మెట్లను ఉపయోగించాలని, వెనుక కూర్చునే ప్రయాణికులు కూడా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అలాగే కార్లలో ప్రయాణించే ప్రతి ఒక్కరూ సీట్‌బెల్ట్ వినియోగాన్ని అలవాటు చేసుకోవాలని, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ద్వారా ప్రమాదాలను గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు..ప్రజల ప్రాణాలను కాపాడటమే పోలీస్ శాఖ ప్రధాన లక్ష్యమని, ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతపై బాధ్యతతో వ్యవహరించాలని ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి పిలుపునిచ్చారు. ఈ అవగాహన కార్యక్రమంలో ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ పోలీసు సిబ్బంది పాల్గొని వాహనదారులకు ట్రాఫిక్ నియమాలపై సూచనలు అందించారు..

ఇది మన హక్కు సమాచార పత్రిక 

మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్

 వడ్లకొండ మహేందర్ గౌడ్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి