ఇది మన హక్కు సమాచార పత్రిక✍️
నిష్పక్షపాత జర్నలిజమే ప్రజల గుండెల్లో శాశ్వత స్థానం కల్పిస్తుంది – మునీర్ బాయ్ జీవితం ప్రతి పాత్రికేయుడికి స్ఫూర్తి: మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి..
గోదావరిఖని, జూలై 21 (ఇది మన హక్కు): ప్రజల పక్షాన నిలబడి నిజాయితీతో, నిష్పక్షపాతంగా పనిచేసే జర్నలిస్టులకే సమాజంలో శాశ్వత గౌరవం, ప్రజల గుండెల్లో చిరస్థాయి స్థానం లభిస్తుందని తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ కే. శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. గోదావరిఖని ప్రెస్ క్లబ్ సౌజన్యంతో అక్షర ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన "ప్రొలిటేరియన్ జర్నలిస్ట్ మునీర్ బాయ్" పుస్తక పరిచయ సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
జర్నలిజం అనేది కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, ప్రజల హక్కులను కాపాడే బాధ్యతతో కూడిన సామాజిక ధర్మమని ఆయన అన్నారు. అధికారాన్ని ప్రశ్నించడం, ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకురావడం, వాస్తవాలను నిర్భయంగా ప్రజల ముందుకు తీసుకురావడమే నిజమైన జర్నలిజమని పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించడమే పాత్రికేయుడికి అత్యంత పెద్ద పురస్కారమని చెప్పారు.
జర్నలిస్టు మునీర్ బాయ్ జీవితాన్ని ప్రస్తావిస్తూ, జీవితాంతం ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రజల పక్షాన నిలిచి, అన్యాయం, ఆధిపత్యం, అవినీతిని ప్రశ్నించిన ధైర్యవంతుడైన పాత్రికేయుడిగా ఆయన నిలిచిపోయారని కొనియాడారు. ఎన్నో ఒత్తిళ్లు, ఇబ్బందులు ఎదురైనా విలువలతో కూడిన జర్నలిజాన్ని వదల్లేదని, అలాంటి వ్యక్తుల జీవితం నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శంగా నిలవాలని అన్నారు.
దేశంలో మీడియా రంగం క్రమంగా కార్పొరేట్ శక్తుల ప్రభావంలోకి వెళ్లిపోతుండడం ఆందోళనకరమని ఆయన పేర్కొన్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి ఒక్కసారి కూడా మీడియా సమావేశం నిర్వహించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థకు మంచిది కాదన్నారు. ప్రశ్నించే మీడియా బలహీనపడితే ప్రజాస్వామ్యమే బలహీనపడుతుందని హెచ్చరించారు.
కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన నాలుగు లేబర్ కోడ్స్ జర్నలిస్టుల హక్కులు, ఉద్యోగ భద్రతపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జర్నలిస్టుల వేతనాలు, సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం మరోసారి సమిష్టి పోరాటం అవసరమని అభిప్రాయపడ్డారు.
ప్రధాన మీడియా సంస్థలు వృత్తి నిబద్ధతను కోల్పోవడం వల్లే సోషల్ మీడియా ప్రభావం పెరిగిందని ఆయన విశ్లేషించారు. అయితే సోషల్ మీడియాలో వాస్తవ నిర్ధారణ లేకుండా ప్రసారమవుతున్న సమాచారంపై నియంత్రణ, బాధ్యత కూడా అవసరమన్నారు.
ఈ సందర్భంగా రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ మాట్లాడుతూ, మునీర్ బాయ్ జీవితం నేటి తరం జర్నలిస్టులకు ఆదర్శమని కొనియాడారు. కోల్‌బెల్ట్ ప్రాంత జర్నలిస్టులకు ఇంటి స్థలాలు, ఇందిరమ్మ ఇళ్ల కోసం కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మునీర్ బాయ్ జీవితంపై పరిశోధనలు జరగాలని, ఆయన ఆలోచనలు భావితరాలకు చేరేలా చూడాలని సూచించారు.
సభకు అక్షర ఫౌండేషన్ అధ్యక్షుడు మాదాసి రామమూర్తి అధ్యక్షత వహించగా, రామగుండం మేయర్ మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ పాతపల్లి ఎల్లయ్య, ఐజేయూ–టీయూడబ్ల్యూజే నాయకులు, గోదావరిఖని ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, రచయితలు, ప్రజా సంఘాల నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు, జర్నలిస్టులు, సాహితీవేత్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు...
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి