21, జులై 2026, మంగళవారం

ఆగస్టు 30లోగా అన్ని బీసీ గురుకుల విద్యాసంస్థల తనిఖీలు పూర్తి చేయాలి – మంత్రి పొన్నం ప్రభాకర్ కఠిన ఆదేశాలు

ఇది మన హక్కు సమాచార పత్రిక✍️


ఆగస్టు 30లోగా అన్ని బీసీ గురుకులాల తనిఖీలు పూర్తి చేయాలి  ప్రతి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి: మంత్రి పొన్నం ప్రభాకర్..

ప్రతి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటన తప్పనిసరి

విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై ప్రత్యేక దృష్టి •

ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు తావులేకుండా కఠిన పర్యవేక్షణ,

ప్రతి నెల 15 గురుకులాలపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తామని హెచ్చరిక..

హైదరాబాద్, జూలై 21: మహాత్మా జ్యోతిబా ఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ (MJPTBCWREIS) పరిధిలోని అన్ని గురుకుల విద్యాసంస్థలను ఈ ఏడాది ఆగస్టు 30లోగా పూర్తిస్థాయిలో తనిఖీ చేయాలని బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధికారులను ఆదేశించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, సురక్షిత వాతావరణం, మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.

గురుకుల విద్యాసంస్థల నిర్వహణ, విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, విద్యార్థుల సంక్షేమంపై MJPTBCWREIS రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు (RCOలు) మరియు ఉన్నతాధికారులతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ప్రతి ఆర్‌సీవో వారానికి మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటన తప్పనిసరి

ప్రతి రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్ వారానికి కనీసం మూడు రోజులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ కనీసం ఆరు గురుకుల విద్యాసంస్థలను సందర్శించాలని మంత్రి ఆదేశించారు. కేవలం పర్యవేక్షణకే పరిమితం కాకుండా ప్రధాన కార్యాలయం, జిల్లా యంత్రాంగం, విద్యాసంస్థల మధ్య సమన్వయం కల్పించే కీలక బాధ్యతను ఆర్‌సీవోలు సమర్థంగా నిర్వహించాలని సూచించారు.

సొంత భవనాల నిర్మాణానికి భూముల సేకరణ వేగవంతం చేయాలి

సొంత భవనాలు లేని గురుకుల విద్యాసంస్థలకు భూముల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని, ఇందుకోసం జిల్లా కలెక్టర్లతో సమన్వయం చేసుకొని అవసరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. ఏ నియోజకవర్గానికి మంజూరైన విద్యాసంస్థ అదే నియోజకవర్గ పరిధిలోనే సొంత భవనం ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

అద్దె భవనాల మరమ్మతులకు 6 శాతం నిధులు తప్పనిసరిగా వినియోగించాలి

అద్దె భవనాలకు చెల్లించే మొత్తంలో ఆరు శాతం నిధులను భవనాల మరమ్మతులు, నిర్వహణ కోసం తప్పనిసరిగా వినియోగించాలని అధికారులకు సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదన్నారు.

రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్‌పై ప్రత్యేక దృష్టి

వర్షాభావ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి విద్యాసంస్థలో రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ వ్యవస్థలను సమర్థవంతంగా అమలు చేసి భవిష్యత్తులో నీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

తల్లిదండ్రుల ఫిర్యాదులకు వెంటనే స్పందించాలి

తల్లిదండ్రుల నుంచి వచ్చే ఫిర్యాదులు, సూచనలు, సలహాలను ఎప్పటికప్పుడు ప్రధాన కార్యాలయానికి తెలియజేసి వాటిపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యలు పెరగకముందే పరిష్కరించే విధంగా అధికారులు పనిచేయాలని అన్నారు.

చదువుతో పాటు క్రీడలు, కళలు, వ్యక్తిత్వ వికాసంపై దృష్టి

విద్యార్థులకు పాఠ్యాంశాల్లోనే కాకుండా క్రీడలు, కళలు, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసం వంటి రంగాల్లోనూ అవకాశాలు కల్పించాలని మంత్రి పేర్కొన్నారు. ప్రతిభ కనబరిచే విద్యార్థుల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తే వారికి ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తామని హామీ ఇచ్చారు.

మానసిక ఆరోగ్యం కోసం సైకాలజిస్టులతో అవగాహన కార్యక్రమాలు

విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనుకాకుండా సైకాలజిస్టులతో అవగాహన సమావేశాలు నిర్వహించాలని, వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అధికారులను ఆదేశించారు.

ఫుడ్ పాయిజనింగ్ ఘటనలకు తావులేకుండా చర్యలు

ఈ విద్యా సంవత్సరంలో ఎక్కడా ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు జరగకుండా వంటశాలలు, ఆహార నాణ్యత, పరిశుభ్రతపై నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని మంత్రి స్పష్టం చేశారు.

ప్రతి నెల 15 గురుకులాలపై ఆకస్మిక తనిఖీలు

ప్రతి నెల కనీసం 15 గురుకుల విద్యాసంస్థలను తాను, కమిషనర్, కార్యదర్శి కలిసి ఆకస్మికంగా తనిఖీ చేస్తామని మంత్రి తెలిపారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మూసీ గురుకులకు సొంత భవనం – మొక్కల సంరక్షణ బాధ్యత విద్యార్థులకే

మూసీ గురుకుల విద్యాసంస్థకు సొంత భవనం నిర్మాణం కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని వెల్లడించారు. అలాగే ప్రతి విద్యాసంస్థలో విస్తృతంగా మొక్కలు నాటించి వాటి సంరక్షణ బాధ్యతను విద్యార్థులకే అప్పగించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయాదేవి, MJPTBCWREIS కార్యదర్శి బడుగు సైదులు, డిప్యూటీ సెక్రటరీలు, రీజినల్ కోఆర్డినేటింగ్ ఆఫీసర్లు (RCOలు) తదితరులు పాల్గొన్నారు...


✍️ఇది మన హక్కు సమాచార పత్రిక

 మేనేజింగ్ డైరెక్టర్ & ఎడిటర్

 వడ్లకొండ మహేందర్ గౌడ్


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి