23, జులై 2026, గురువారం

నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆగ్రహం.. జూలై 24 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతివ్వండి: విద్యార్థి–యువజన సంఘాలు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్✍️

నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా ఆగ్రహం.. జూలై 24 రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు మద్దతివ్వండి: విద్యార్థి–యువజన సంఘాలు

గోదావరిఖని, జూలై 23 (ఇది మన హక్కు): 
నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారం దేశంలోని లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చిందని, ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాలని ఎన్‌ఎస్‌యూఐ, డీవైఎఫ్‌ఐ నాయకులు డిమాండ్ చేశారు. జూలై 24న రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించనున్న విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో విద్యార్థులు, ప్రజలకు పిలుపునిచ్చారు..ఈ సందర్భంగా ఎన్‌ఎస్‌యూఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బైరిమల్ల దుర్గాప్రసాద్, డీవైఎఫ్‌ఐ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కొంటు సాగర్ మాట్లాడుతూ, ఢిల్లీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు, యువతపై జరిగిన పోలీసుల దమనకాండను తీవ్రంగా ఖండించారు. ఈ ఘటనపై స్వతంత్ర జాతీయ స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు..నీట్ పేపర్ లీకేజీ కారణంగా నష్టపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలని, మరణించిన విద్యార్థుల కుటుంబాలకు రూ.1 కోటి ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఎన్‌టీఏ (NTA) వ్యవస్థను రద్దు చేసి ప్రవేశ పరీక్షల నిర్వహణను రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని కోరారు. అలాగే VBSA చట్టాన్ని వెనక్కి తీసుకోవాలని, ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనం వాంగ్‌చుక్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు..దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థుల నమ్మకాన్ని దెబ్బతీసే ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ, పారిశ్రామిక ప్రాంతంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలలు జూలై 24న నిర్వహించే రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలపాలని విద్యార్థి, యువజన సంఘాలు విజ్ఞప్తి చేశాయి..ఈ కార్యక్రమంలో విద్యార్థి, యువజన సంఘాల నాయకులు జీవన్, ఆకాష్, కృష్ణకుమార్, సురేష్, రితీష్, సూర్య తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి