15, మే 2026, శుక్రవారం

నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌తో బస్టాండ్‌, బస్సులు,పార్సిల్ కేంద్రాల్లో గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల విస్తృత తనిఖీలు

 ఇది మన హక్కు రామగుండం మండల రిపోర్టర్ ✍️

నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌తో బస్టాండ్‌, బస్సులు,పార్సిల్ కేంద్రాల్లో గోదావరిఖని వన్‌టౌన్ పోలీసుల విస్తృత తనిఖీలు

రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి జోన్ గోదావరిఖని వన్‌టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బస్టాండ్ ప్రాంతం,కార్గో పార్సిల్ కేంద్రాలు,దుకాణాలు, పాన్ షాపులతో పాటు పలు బస్సుల్లో కూడా గోదావరిఖని వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, నార్కోటిక్ వింగ్ ఇన్‌స్పెక్టర్ ఎం. రాజ్‌కుమార్ సమన్వయంతో శుక్రవారం నార్కోటిక్ స్నిఫర్ డాగ్ సహాయంతో విస్తృత తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ గంజాయి సరఫరా, వినియోగాన్ని నియంత్రించడమే లక్ష్యంగా ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తున్నామని, నార్కోటిక్ స్నిఫర్ డాగ్‌లతో కూడా ప్రత్యేక తనిఖీలు చేపడుతున్నామని తెలిపారు.
📌 తనిఖీలలో బీహార్‌కు చెందిన ఓ వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ దగ్గరకు స్నిఫర్ డాగ్ వెళ్లి వాసన చూడడంతో అతడిని తనిఖీ చేయగా, బ్యాగ్‌లో పొగాకు (తంబాకు) ప్యాకెట్ లభించింది.ప్రభుత్వం నిషేధించిన గంజాయి లేదా ఇతర మత్తు పదార్థాలు కలిగి ఉన్నా,విక్రయిస్తున్నా ప్రత్యేక శిక్షణ పొందిన ఈ డాగ్ క్షణాల్లో గుర్తించే సామర్థ్యం కలిగి ఉందని పేర్కొన్నారు.
📌 ఎవరైనా గంజాయి,మత్తు పదార్థాలు, చిన్నపిల్లలకు మత్తు పదార్థాలు కలిపిన చాక్లెట్లు,గుట్కా, సిగరెట్లు వంటి నిషేధిత వస్తువులు విక్రయించిన పక్షంలో కఠినచర్యలు తీసుకుంటామని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు.
📌 బస్టాండ్‌లో ఉన్న ప్రయాణికుల బ్యాగులు, అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తుల వివరాలను సేకరించారు.
📌 గంజాయి,మత్తు పదార్థాలు బస్సులు, రైల్వే మార్గాలు, ప్రైవేట్ వాహనాలు, కార్ల ద్వారా తరలిస్తున్నారని తెలిపారు. ప్రయాణికులు బస్సులు,రైళ్లలో ప్రయాణించే సమయంలో ఎవరైనా అనుమానాస్పదంగా బ్యాగులతో కనిపించినా,మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్నట్లు సమాచారం తెలిసినా వెంటనే స్థానిక పోలీసులకు లేదా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో టోల్ ఫ్రీ నంబర్ 1908 లేదా డయల్ 100కు సమాచారం అందించాలని కోరారు.సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు.
📌 యువత మత్తు పదార్థాలకు బానిస కాకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని సూచించారు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో నార్కోటిక్ టీమ్ ఇన్‌స్పెక్టర్ రాజ్‌కుమార్, రామగుండం ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ రాజేశ్వరరావు, గోదావరిఖని వన్‌టౌన్ ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది,నార్కోటిక్ టీమ్ సిబ్బంది పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి