ఇల్లు ఉన్నవారికే ఇందిరమ్మ ఇళ్లు?.. వరద బాధితులకు న్యాయం ఎక్కడ? మారేడుపల్లి వాసుల ఆవేదన
వరదల్లో నష్టపోయిన నిరుపేదలకు ఇళ్ల మంజూరులో అన్యాయం జరుగుతోందని గ్రామస్థుల ఆగ్రహం.. అర్హులైన బాధితులను గుర్తించి వెంటనే న్యాయం చేయాలని విజ్ఞప్తి
జగిత్యాల, ఆగస్టు 7 (ఇది మన హక్కు): జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం మారేడుపల్లి గ్రామంలో వరదల కారణంగా తీవ్ర నష్టపోయిన కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్ల పథకం అందడం లేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజంగా ఇల్లు కోల్పోయిన, గోడలు కూలిపోయిన, నివాసానికి అనువుగా లేని ఇళ్లలో జీవిస్తున్న నిరుపేదలకు కాకుండా ఇప్పటికే ఇల్లు ఉన్న కొందరికి పథకం ప్రయోజనం లభిస్తోందని ఆరోపిస్తున్నారు..
ఇటీవలి భారీ వర్షాలు, వరదలతో మారేడుపల్లి గ్రామంలోని పలువురు కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాయి. కొన్ని ఇళ్లు పూర్తిగా దెబ్బతినగా, మరికొన్ని నివాసయోగ్యం కాకుండా మారాయని గ్రామస్థులు చెబుతున్నారు. అయినప్పటికీ అర్హులైన వరద బాధితుల పేర్లు జాబితాలో లేకపోవడం తీవ్ర నిరాశ కలిగిస్తోందని పేర్కొంటున్నారు.
ఇప్పటికే పక్కా ఇళ్లు ఉన్న కొందరికి ఇందిరమ్మ ఇళ్ల మంజూరు జరుగుతుండగా, నిజంగా అవసరమైన పేద కుటుంబాలు పథకానికి దూరమవుతున్నాయని వారు ఆరోపించారు. వరదలతో నష్టపోయిన ప్రతి కుటుంబాన్ని అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించి, అర్హత ప్రమాణాల ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం నిజమైన అర్హులకు చేరితేనే దాని లక్ష్యం నెరవేరుతుందని గ్రామస్థులు అభిప్రాయపడుతున్నారు. గ్రామంలో ప్రత్యేక సర్వే నిర్వహించి, వరదలతో నష్టపోయిన నిరుపేద కుటుంబాలను గుర్తించి వెంటనే ఇళ్లను మంజూరు చేయాలని, అలాగే తాత్కాలిక ఆర్థిక సాయం కూడా అందించాలని కోరుతున్నారు.
గ్రామస్థుల విజ్ఞప్తిపై సంబంధిత అధికారులు స్పందించి, అర్హులైన వరద బాధితులకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు..

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి