29, జులై 2026, బుధవారం

ఉపాధి హామీ ఉద్యోగులకు పే స్కేల్ అమలు చేయాలి.. సమ్మె నోటీసు అందజేసిన ఉద్యోగులు

మూడు నెలల వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్.. ఆగస్టు 15లోపు హెచ్‌ఆర్ పాలసీ అమలు చేయాలని జేఏసీ హెచ్చరిక..
రామగిరి ఎంపీడీఓ కార్యాలయంలో సమ్మె నోటీసు అందజేస్తున్న ఉపాధి హామీ ఉద్యోగులు

రామగిరి, జూలై 29 (ఇది మన హక్కు): పెద్దపల్లి జిల్లా రామగిరి మండల ఎంపీడీఓ బద్రి శైలజా రాణికి గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలో పనిచేస్తున్న వి.బి.జీ–రామ్ జీ (ఉపాధి హామీ) ఉద్యోగులు బుధవారం సమ్మె నోటీసు అందజేశారు. తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు.

 గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎస్‌ఆర్‌డీఎస్, వి.బి.జీ–రామ్ జీ (NREGS) ఉద్యోగులు మూడు నెలలుగా వేతనాలు అందక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. బకాయి వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
అలాగే 2026 ఆగస్టు 15 నాటికి నూతన హెచ్‌ఆర్ పాలసీని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, గ్రేడ్ పే, పదోన్నతులు, బడ్జెట్, ట్రావెల్ అలవెన్స్ తదితర సమస్యలను పరిష్కరించాలని ఎస్‌ఆర్‌డీఎస్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని కోరింది.
ప్రభుత్వం తమ డిమాండ్లపై సానుకూల నిర్ణయం తీసుకోకపోతే దశలవారీ ఆందోళనలు చేపడతామని జేఏసీ హెచ్చరించింది. ఆగస్టు 15 నాటికి స్పష్టమైన ప్రకటన వెలువడకపోతే ఆగస్టు 16 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు, తీవ్రస్థాయి ఆందోళనలు చేపడతామని జేఏసీ రాష్ట్ర ట్రెజరర్ కొండ సత్యనారాయణ తెలిపారు.
ఈ కార్యక్రమంలో టీజీఆర్‌డీ జేఏసీ రాష్ట్ర ట్రెజరర్ కొండ సత్యనారాయణ, ఇంజినీరింగ్ కన్సల్టెంట్ వి. మౌనిక, సాంకేతిక సహాయకులు మల్క అఖిల, నేరెళ్ల సుప్రియ తదితరులు పాల్గొన్నారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి