ముందస్తు చర్యల్లో మున్సిపల్ కార్పొరేషన్ నిర్లక్ష్యం..వరదలకు అదే కారణం: మద్దెల దినేష్
కాలువల పూడిక తొలగించకపోవడం వల్లే వరద పరిస్థితులు.. ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
గోదావరిఖని, జూలై 30 (ఇది మన హక్కు): వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని ఫైట్ ఫర్ బెటర్ సొసైటీ అధ్యక్షులు మద్దెల దినేష్ ఆరోపించారు.
గురువారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, నగరంలోని ప్రధాన మురికి కాలువలు, డివిజన్లలోని డ్రైనేజీలు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీలలో ముందుగానే పూడిక తొలగించకపోవడం వల్లే భారీ వర్షాలకు వరద పరిస్థితులు ఏర్పడ్డాయని విమర్శించారు. వర్షాలు వచ్చిన తర్వాత మాత్రమే అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించడం వల్ల ప్రయోజనం ఉండదన్నారు.
ప్రధాన కాలువల పక్కనే అక్రమ నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చెరువులు, కుంటలు, వాగులు ఆక్రమణలకు గురికావడంతో వరద నీరు వెళ్లే మార్గాలు మూసుకుపోయి, నీరు కాలనీలు, ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
రామగుండంలో ప్రత్యేకంగా "హైడ్రా" తరహా వ్యవస్థ ఏర్పాటు చేసి చెరువులు, కుంటలు, కాలువల ఆక్రమణలను తొలగించి, వరద నీరు నిరాటంకంగా వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మద్దెల దినేష్ కోరారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి