28, జులై 2026, మంగళవారం

అంతిమ సంస్కారాలకే అవస్థలు.. గోదావరిఖని హిందూ స్మశాన వాటికలో శతకోటి సమస్యలు

 ఇది మన హక్కు పెద్దపల్లి జిల్లా బ్యూరో రిపోర్టర్✍️

అంతిమ సంస్కారాలకే అవస్థలు.. గోదావరిఖని హిందూ స్మశాన వాటికలో శతకోటి సమస్యలు

సింగరేణికి నిర్వహణ అప్పగించి ఉచిత సేవలు అందించాలి.. స్మశాన వాటిక అభివృద్ధికి 10 ఎకరాల స్థలం కేటాయించాలని డిమాండ్

పూలు చల్లి వినూత్న నిరసన తెలిపిన స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ప్రతినిధులు

గోదావరిఖని, జూలై 29 (ఇది మన హక్కు): గోదావరిఖని ప్రాంతంలోని గోదావరి నది తీరంలో ఉన్న హిందూ స్మశాన వాటికలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం వినూత్నంగా పూలు చల్లి నిరసన కార్యక్రమం నిర్వహించారు. స్మశాన వాటికలో కనీస మౌలిక వసతులు లేక ప్రజలు, ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా స్వచ్ఛంద సంఘాల ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు మద్దెల దినేష్, అధ్యక్షుడు, మాజీ కార్పొరేటర్ అయిత శివకుమార్, ప్రధాన కార్యదర్శి దుర్గం నగేష్, ఉపాధ్యక్షురాలు గోలివాడ చంద్రకళ మాట్లాడుతూ, ప్రజల జీవితంలో అత్యంత విషాదకరమైన సందర్భమైన అంతిమ సంస్కారాల సమయంలో కూడా కనీస సౌకర్యాలు లేకపోవడం దురదృష్టకరమని విమర్శించారు. మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

మూడేళ్లుగా రూ.1తో అంత్యక్రియలు నిర్వహించే సేవలు నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి కుటుంబాలపై అదనపు ఆర్థిక భారం పడుతోందని తెలిపారు. స్మశాన వాటికలో తాగునీటి సౌకర్యం లేకపోవడం, రాత్రి సమయంలో విద్యుత్ లేకపోవడం, ప్రహరీ గోడ లేకపోవడం, సరైన రహదారి లేక శవయాత్రలు కూడా ఇబ్బందికరంగా మారడం వంటి సమస్యలను వివరించారు.

దాదాపు పదేళ్ల క్రితం రూ.40 లక్షలతో కొనుగోలు చేసిన గ్యాస్ దహన యంత్రం ఇప్పటికీ వినియోగంలోకి రాక వృథాగా ఉందని, దాని కోసం రూ.60 లక్షల వ్యయంతో నిర్మించిన షెడ్డు కూడా ఉపయోగం లేక పాడవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ఈ సదుపాయాలు నిరుపయోగంగా మారడంపై అధికారులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

హిందూ స్మశాన వాటిక ముందు ఉన్న సింగరేణికి చెందిన 10 ఎకరాల ఖాళీ స్థలాన్ని స్మశాన వాటిక విస్తరణ, అభివృద్ధి కోసం కేటాయించాలని కోరారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆధునిక సౌకర్యాలతో స్మశాన వాటికను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు.

మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కార్యాలయాలకే పరిమితం కాకుండా ప్రజల మధ్యకు వచ్చి సమస్యలను పరిశీలించాలని, ఇప్పటి వరకు హిందూ స్మశాన వాటికను ప్రత్యక్షంగా సందర్శించి సమస్యలు తెలుసుకున్నారా అని ప్రశ్నించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కమిషనర్ ఉన్నంత కాలం స్మశాన వాటిక అభివృద్ధి సాధ్యం కాదని విమర్శించారు.

స్మశాన వాటిక నిర్వహణ బాధ్యతను సింగరేణి యాజమాన్యానికి అప్పగించి, ప్రజలకు ఉచిత అంత్యక్రియల సేవలు అందించేలా చర్యలు తీసుకోవాలని రామగుండం ఎమ్మెల్యే మరియు జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకోవాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో మండల శ్రీనివాస్, కంది సుజాత, సరిత లక్ష్మి, రామ, శుశిలా, కొండూ రమాదేవి, ప్రతాప్ తదితరులు పాల్గొని సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి