20, జులై 2026, సోమవారం

జర్నలిస్టుల ఆర్టీసీ రాయితీలో మాయాజాలం..? మూడో వంతు రాయితీకి కోత అంటూ విలేకరుల ఆవేదన

 ఇది మన హక్కు చీఫ్ బ్యూరో  రిపోర్టర్ ✍️

జర్నలిస్టుల ఆర్టీసీ రాయితీలో మాయాజాలం..? మూడో వంతు రాయితీకి కోత అంటూ విలేకరుల ఆవేదన

హైదరాబాద్, జూలై 20 (ఇది మన హక్కు):
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చేందుకు నిత్యం క్షేత్రస్థాయిలో పనిచేసే జర్నలిస్టులకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) కల్పిస్తున్న ప్రయాణ రాయితీల అమలుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. స్టేట్ అక్రిడిటేషన్ నిబంధనల ప్రకారం జర్నలిస్టులకు టికెట్ ధరలో మూడో వంతు (1/3) మాత్రమే వసూలు చేయాల్సి ఉండగా, ప్రస్తుతం ఎక్స్‌ప్రెస్, ఎలక్ట్రిక్ బస్సుల్లో సగానికి పైగా చార్జీలు వసూలు చేస్తున్నట్లు విలేకరులు ఆరోపిస్తున్నారు..బస్సు పాస్‌లపై 1/3 రాయితీ అని పేర్కొంటున్నప్పటికీ, టికెట్ మిషన్లలో (టిమ్స్) అదే విధానం అమలు కావడం లేదని, సాఫ్ట్‌వేర్ లోపాల కారణంగా అధిక చార్జీలు పడుతున్నాయని ఆర్టీసీ సిబ్బంది చెబుతున్నట్లు సమాచారం. దీంతో జర్నలిస్టులు, కండక్టర్ల మధ్య తరచూ వాగ్వివాదాలు చోటుచేసుకుంటున్నాయని పేర్కొంటున్నారు..గ్రామీణ ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రాలు, పట్టణాలకు నిత్యం వార్తల సేకరణ కోసం ప్రయాణించే విలేకరులపై ఈ అదనపు భారం తీవ్ర ప్రభావం చూపుతోందని ఆవేదన వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 53 నుంచి 55 శాతం, ఎలక్ట్రిక్ బస్సుల్లో సుమారు 60 శాతం వరకు చార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు..ఈ అంశంపై జర్నలిస్ట్స్ సంక్షేమ సంఘం (జేఎస్‌ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ స్పందిస్తూ, జర్నలిస్టులకు అన్ని రకాల బస్సుల్లో గతంలో అమలైన మూడో వంతు రాయితీని యథాతథంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. టికెట్ మిషన్లలోని సాఫ్ట్‌వేర్ లోపాలను వెంటనే సరిచేసి, జర్నలిస్టులకు కల్పిస్తున్న రాయితీలను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం తక్షణమే స్పందించాలని కోరారు..

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి