31, జులై 2026, శుక్రవారం

సింగరేణి ఆర్జీ-1లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన జీఎం లలిత్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు

సింగరేణి ఆర్జీ-1లో వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన జీఎం లలిత్ కుమార్, ఏఐటీయూసీ..

2ఏ ఇంక్లైన్ అండర్ బ్రిడ్జి ప్రధాన కాలువ ఆధునీకరణకు హామీ.. డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తామని జీఎం వెల్లడి 

సింగరేణి ఆర్జీ-1లో వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలిస్తున్న జీఎం లలిత్ కుమార్, ఏఐటీయూసీ నాయకులు
2ఏ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ప్రధాన కాలువను పరిశీలిస్తున్న సింగరేణి అధికారులు
గోదావరిఖని, జూలై 31 (ఇది మన హక్కు): గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో సింగరేణి రామగుండం-1 ఏరియాలోని ఉదయ్‌నగర్, 2ఏ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి వరద ప్రభావిత ప్రాంతాలను శుక్రవారం ఆర్జీ-1 జనరల్ మేనేజర్ లలిత్ కుమార్, సివిల్ డీజీఎం వరప్రసాద్, గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, అధికారులు కలిసి పరిశీలించారు..

2ఏ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న ప్రధాన కాలువలో వరద ప్రవాహం, కంపెనీ క్వార్టర్లలో మురికి నీరు, వర్షపు నీరు నిల్వ ఉండడంతో కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని ఏఐటీయూసీ ప్రతినిధులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.

ఈ సందర్భంగా జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ 2ఏ ఇంక్లైన్ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న ప్రధాన కాలువను ఆధునీకరించడంతో పాటు కంపెనీ క్వార్టర్లలోని డ్రైనేజీ వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.

ఏఐటీయూసీ ఆర్జీ-1 బ్రాంచి కార్యదర్శి రంగు శ్రీను మాట్లాడుతూ, ఆర్జీ-1 పరిధిలోని క్వార్టర్ల డ్రైనేజీ వ్యవస్థ సుమారు 30 సంవత్సరాల క్రితం నిర్మించబడిందని, పైపులు దెబ్బతినడంతో మురుగు నీరు బయటకు వస్తూ కార్మిక కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. సెక్టార్-1, సెక్టార్-2 క్వార్టర్లలో డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించి, కార్మిక కుటుంబాలకు శాశ్వత పరిష్కారం కల్పించాలని సింగరేణి యాజమాన్యాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు..



 




 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి