🌾 రైతు నేస్తం 100వ వారోత్సవం విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష
ఉత్తమ రైతులు, వ్యవసాయ విస్తరణ అధికారులకు సన్మానం.. రాఘవపూర్‌లో జిల్లా కోర్టు స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్....
కమాన్‌పూర్/పెద్దపల్లి, జూలై 28 (ఇది మన హక్కు): రైతులకు ఆధునిక సాగు పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞానం, పంటల నిర్వహణపై నిరంతర అవగాహన కల్పిస్తున్న 'రైతు నేస్తం' కార్యక్రమం విజయవంతంగా 99 వారాలు పూర్తి చేసుకుని 100వ వారంలోకి అడుగుపెట్టడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు.
మంగళవారం పెద్దపల్లి మండలం రాఘవపూర్ రైతు వేదికలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రైతు నేస్తం 100వ వారోత్సవ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు శాస్త్రీయ సాగు విధానాలను అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని, ప్రభుత్వం అందిస్తున్న పథకాలను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి వారం వ్యవసాయ నిపుణులు అందిస్తున్న సాంకేతిక సూచనలు వ్యవసాయ రంగంలో సానుకూల మార్పులకు దోహదపడుతున్నాయని తెలిపారు.
రాష్ట్ర స్థాయి కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజూ, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సురేంద్ర మోహన్, వ్యవసాయ శాఖ సంచాలకులు గోపీ, ఉద్యానవన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా రైతులను ఉద్దేశించి ప్రసంగించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రైతులు **మాదాసు భూమయ్య (పాలకుర్తి), జునేని శ్యాంసుందర్ రావు (శివపల్లి), గుర్రాల రాజయ్య (గుండారం)**తో పాటు వ్యవసాయ విస్తరణ అధికారులు **ఎం. ఈశ్వర్ రెడ్డి (శ్రీరాంపూర్), ప్రత్యూష (మంథని)**లను జిల్లా కలెక్టర్ జ్ఞాపికలతో సత్కరించారు.
అనంతరం రాఘవపూర్‌లో నిర్మించనున్న జిల్లా కోర్టు భవనం ప్రతిపాదిత స్థలాన్ని కలెక్టర్ పరిశీలించి, నిర్మాణ పనులు వేగవంతంగా చేపట్టేందుకు సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాస్, అదనపు సంచాలకులు శ్రీనాథ్, మండల వ్యవసాయ అధికారి నాగార్జున, వ్యవసాయ విస్తరణ అధికారులు, రైతులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి